విజయవాడ, ఆగస్టు 17,
ఏపీలో కమ్మలు ఒక విధంగా చెప్పాలంటే కొంత కలవరంతోనే ఉన్నారనుకోవాలి. నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం చల్లని నీడలో అన్ని విధాలుగా ఎదిగిన వారికి ఇపుడు చుక్కలు కనిపిస్తున్నాయి. లెక్కలు తేలుస్తామంటూ జగన్ సర్కార్ దూకుడు చేస్తోంది. గత రెండున్నర ఏళ్ల వైసీపీ పాలనలో కమ్మలు టార్గెట్ అవుతున్నారు అన్న బాధ అయితే ఆ సామాజిక వర్గంలో ఉంది. ఇక తెలుగుదేశం పార్టీని తప్పనిసరిగా నమ్ముకుంటున్నా కూడా వేరే ఇతర మార్గాల కోసం కూడా కమ్మలు అన్వేషిస్తున్నారు.ఏపీలో కమ్మలు టీడీపీ మీద ఒక విధంగా అపనమ్మకంతోనే ఉన్నారు. చంద్రబాబుకు అవుట్ రేట్ గా మద్దతు ఇచ్చినా 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందా అన్న చింత అయితే ఉంది. ఇక లోకేష్ మీద వారికి పెద్దగా ఆశలు అయితే లేవు. అందుకే జూనియర్ ఎన్టీయార్ కోసం రాయబేరాలు పై స్థాయిలో జరుగుతున్నాయని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేళ చేసిన కామెంట్స్ కమ్మలకు గట్టి భరోసా ఇచ్చినట్లుగా ఉందని అంటున్నారు. ఒక సామజిక వర్గాన్ని కోరి టార్గెట్ చేయడం మంచిది కాదు అంటూ ఆయన జగన్ కి నేరుగానే హెచ్చరికలు పంపించారు.రాజకీయ కక్షలను పాలనలో చూపించి శిక్షలు విధించడం మంచి పరిణామం కాదని కూడా పవన్ కల్యాణ్ అంటున్నారు. ఆ విధంగా ఆయన చేసిన ప్రకటన కమ్మలకు పూర్తి స్వాంతన చేకూర్చింది అనే చెబుతున్నారు. కమ్మలు కోరుకునేది కూడా ఇదే. జనంలో విశేష ఆదరణ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వారు తమకు అండగా ఉంటే రేపటి రోజున రాజకీయంగా మళ్ళీ అద్భుతాలు జరుగుతాయని కూడా వారు అంచనా వేస్తున్నారు. పవన్ సైతం తన రాజకీయాన్ని కేవలం కాపుల వద్దనే ఆపేసి కుల నాయకుడిగా మిగిలిపోదలచుకోలేదు అంటున్నారు. పైగా కమ్మ కాపు కాంబో కోసం ఆయన గట్టిగానే కృషి చేస్తున్నారు అని చెబుతున్నారు.ఏపీలో కమ్మలు, కాపుల మధ్య సామరస్యం ఉంటే 2014 నాటి ఎన్నికల ఫలితాలే 2024లో కూడా రిపీట్ అవుతాయని అంటున్నారు. పవన్ కమ్మల విషయంలో ఇలా వెనకేసుకురావడం వెనక వ్యూహం కూడా అదేనని అంటున్నారు. కమ్మలు కాపుల మధ్య స్నేహ బంధం గట్టిగా ఉంటే రేపటి రోజున టీడీపీ జనసేన పొత్తులు కూడా పూర్తిగా సక్సెస్ అవుతాయని కూడా భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ తన పక్కన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ ని ఉంచుకోవడం వెనక కూడా అంతరార్ధం ఇదేనని అంటున్నారు. ఇక టీడీపీతో పవన్ చేయి కలిపేందుకు ఈ ప్రకటన తొలి మెట్టుగా కూడా భావిస్తున్నారు. మొత్తానికి రేపటి రోజున టీడీపీతో వెళ్ళినా ఫ్యూచర్ లో ఆ సామాజిక వర్గం మద్దతు దండీగా తనకే దక్కేలా పవన్ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి ఈ కాంబోను జగన్ ఎలా తట్టుకుని ముందుకు సాగుతారో.