దళితుల ఇంటికెళ్లి వాళ్లతో భోజనం చేసి, ఫొటోలకు పోజులిచ్చి, పబ్లిసిటీ చేసుకుంటున్న బీజేపీ నేతలకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చురకంటించారు. మీ డ్రామాలు ఆపండి అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఢిల్లీలో ఆరెస్సెస్, వీహెచ్‌పీ నేతలతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి డ్రామాలు ఆడే బదులు.. రెగ్యులర్‌గా దళితులను కలుస్తూ, వాళ్లతో మాట్లాడుతూ ఉండటం మేలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చట్టాన్ని నీరుగార్చేందుకు చూస్తున్నదన్న విమర్శల నేపథ్యంలో.. దళితులకు దగ్గరయ్యేందుకు వాళ్ల ఇళ్లకు వెళ్లాలని ప్రధాని మోదీ తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా దళితుల ఇళ్లకు వెళ్లి కాసేపు గడిపారు. ఇతర రాష్ర్టాల్లోనే పలువురు బీజేపీ మంత్రులు, ఎంపీలు ఇలాగే దళితుల ఇళ్లకు వెళ్తున్నారు. అయితే వీళ్లతో పాటు మీడియాను కూడా తీసుకెళ్లి దళితుల ఇళ్లలో తాము తింటున్న ఫొటోలను తీయించి పబ్లిసిటీ చేయించుకుంటున్నారు. దీనిని మోహన్ భగవత్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేసే కంటే తరచూ దళితులను కలుస్తూ వాళ్లను కలుపుకొని వెళ్లాలని ఆరెస్సెస్ కార్యకర్తలకు సూచించారు. భగవత్ విమర్శలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. దళితుల కోసం తాను, తన పార్టీ చాలా చేశామని, కాంగ్రెస్ వాళ్లను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నదని విమర్శించారు. దళితుల ఇళ్లలో భోజనం చేయడం ద్వారా బీజేపీ ఎంపీలు రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలను యోగి తప్పుబట్టారు. కొందరు ఎంపీలు దీనిని తప్పుగా వాడుకుంటున్నంత మాత్రాన అందరికీ దానిని ఆపాదించడం సరికాదని ఆయన అన్నారు