గుంటూరు, ఆగస్టు 17,
తెలుగుదేశం పార్టీ భావి సారధిగా నారా లోకేష్ ను చేసేందుకు గట్టి శిక్షణే ఇస్తున్నారు ఆయన తండ్రి చంద్రబాబు. లోకేష్ నాయకత్వంపై పార్టీలో కొన్ని అనుమానాలు, అపనమ్మకాలు మెజారిటీ నేతల్లో ఉన్నాయి. ముఖ్యంగా టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెన్నంటి నడిచిన నేతల్లో ఈ అపనమ్మకం మరి ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం లోకేష్ మంత్రిగా కీలకమైన శాఖలు నిర్వహించినా అనుకున్న మైలేజ్ తెచ్చుకోలేకపోయారు. గతంలో జీహెచ్ఎంసి ఎన్నికల్లో టిడిపి ఘోర వైఫల్యాలను లోకేష్ నాయకత్వంలోనే పార్టీ చవి చూసింది. ఇక 2019 ఎన్నికల్లో స్వయంగా మంగళగిరి లో ఆయనే ఓటమి పాలయ్యారు. ఇక ట్విట్టర్ వేదికగా విజృంభించడం తప్ప క్షేత్ర స్థాయిలో ఆయన దూసుకెెళ్లలేకపోతున్నారు అనేవి టిడిపి యువరాజు నాయకత్వంపై అపనమ్మకాన్ని ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తారు.ఎన్టీఆర్ టిడిపి వ్యవస్థాపకుడు. ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని కైవసం చేసుకున్నారనే అపవాదును చంద్రబాబు భరిస్తున్నా పార్టీకి దిక్కుమొక్కుగా నిలిచి పసుపు దళాధిపతిగా పాతికేళ్ళుగా సమర్ధంగా ప్రస్థానం సాగిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చంద్రబాబు సమర్ధంగా ఎదుర్కోవడమే కాదు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారపక్షానికి చుక్కలు చూపించడంలో బాబు చాణక్య రాజకీయాలు దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి చాణుక్యుడి వారసుడిగా లోకేష్ సిద్ధం అవుతున్నా, సమర్ధత లేకుండా ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఇక ఇంతే సంగతి అన్న సందేహాలు చాలామంది సీనియర్లను వేధిస్తున్నాయి. దీంతో గత కొంతకాలంగా లోకేష్ పూర్తిస్థాయిలో ట్రెండ్ మార్చేశారు. అలా బాబు తయారు చేసుకుంటున్నారు అనడం వాస్తవం అని చెప్పాలి.పార్టీలో ముఖ్య నేతలకు సంబంధించి మంచి చెడుల్లో నే ఉన్నా అంటూ ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం మొదలు పెట్టారు నారా లోకేష్. కార్యకర్తలతోను సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉండేందుకు నిత్యం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పార్టీ పెట్టినప్పుడు కానీ ప్రధాన విపక్ష నేతగా ఉన్నప్పుడు వైసిపి అధినేత వైఎస్ జగన్ 9 ఏళ్ళపాటు ప్రజల్లోనే ఉండేవారు. అసెంబ్లీకి సైతం డుమ్మా కొట్టి మరీ ఆయన జనంతో మమేకం అయ్యేవారు. ఓదార్పు యాత్ర మొదలు జగన్ తన పాదయాత్ర వరకు ప్రజలను నేరుగా కలిసేవారు. దాంతో లీడర్ గా ఆయన తిరుగులేకుండా ఎదిగారు. అంతేకాదు తన పార్టీని అఖండ మెజారిటీని తెచ్చిపెట్టారు.ఇప్పుడు ఇదే ఫార్ములాలో లోకేష్ ముందుగా వివిధ జిల్లాల పర్యటనకు వెళుతూ పార్టీ క్యాడర్ ను ఆకళింపు చేసుకోవడం మొదలు పెట్టారు. తాత ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుచేయించి వాటిని తానె ప్రారంభించి నారా నందమూరి మధ్య గ్యాప్ లేదనే సందేశాన్ని తీసుకువెళుతున్నారు. ఇక ప్రజలతో నేరుగా టచ్ లోకి వెళ్లేందుకు కరోనా బాగా తగ్గాకా ఆయనకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యూహాలన్నీ లోకేష్ కు టిడిపికి ఏ మేరకు మైలేజ్ తెస్తాయో వేచి చూడాలి.