కాకినాడ, ఆగస్టు 17,
మరికొంతకాలంలో జగన్ క్యాబినెట్ పదవీకాలం రెండున్నరేళ్ళు పూర్తి చేసుకోబోతుంది. తన టర్మ్ లో మంత్రుల కాలపరిమితి సగమే అన్నది ప్రమాణ స్వీకారం నాడే వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసేశారు. దాంతో పార్టీలో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నవారి ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తొలి క్యాబినెట్ లో స్థానం సంపాదించుకున్న కురసాల కన్నబాబు ప్రస్తుతం వ్యవసాయ మంత్రిగా కీలక బాధ్యతలు వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయనపై జగన్ దగ్గర మంచి మార్కులే తప్ప రిమార్కు లు లేవు. దానికి తోడు పార్టీ వ్యవహారాల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాల్లో కన్నబాబు ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండటంతో బాటు అటు విజయసాయి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి కోటరీ తో కూడా సఖ్యతగానే ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ మార్పు అంశం లో జగన్ అన్నమాటకే నిలబడితే కన్నబాబు స్థానం ఉంటుందా లేకా మార్పు జరుగుతుందా అన్న చర్చ ఇప్పటినుంచే తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా సాగుతుంది.సామాజిక వర్గం కోటాలో కురసాల కన్నబాబు కి జగన్ కీలకమైన క్యాబినెట్ పదవి కట్టబెట్టారు. ఆయన్ను మార్చాలిసి వస్తే అదే జిల్లా నుంచి అదే సామాజికవర్గం నుంచి మరొకరికి ఇవ్వాలిసి ఉంటుంది. ఆ అంశానికి వస్తే ప్రస్తుతం వైసిపి స్థాపించాకా రెండోసారి కూడా యనమల కోటలో పాగా వేసిన ప్రస్తుత చీఫ్ విప్ దాడిశెట్టి రాజా ముందు వరుసలో ఉంటారు. రెండు సార్లు వరుసగా ఫ్యాన్ పార్టీ గుర్తుపై గెలిచిన రాజా జగన్ అధికారంలోకి వచ్చాకా మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. కానీ అనూహ్యంగా కన్నబాబు కి మంత్రి పదవి ఇచ్చి రాజా కు విప్ తో సరిపెట్టారు జగన్. దాంతో ఈసారి ఆయనకు కన్నబాబు ను మారిస్తే దాడిశెట్టికి లాటరీ తగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అనుచరుల్లో బలంగా వినిపిస్తున్న మాట. కుటుంబంతో పాటు తొలి నుంచి ప్రయాణం చేస్తున్న వారిలో మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహన రావు కుటుంబం తూర్పుగోదావరి జిల్లాల్లో ముందు వరుసలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు రాజానగరం ఎమ్యెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ జక్కంపూడి రాజా కు ముఖ్యమంత్రి జగన్ టిక్ పెట్టె అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. వైఎస్ కుటుంబం పట్ల జక్కంపూడి కుటుంబం చూపే విధేయత రాజా కు కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రామ్మోహన రావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి రాజానగరం నియోజకవర్గానికి టికెట్ మార్చినా రాజా మంచి మెజారిటీ తో గెలుపొంది యువ బృందంతో సాగిపోతున్నారు. అయితే రాజమండ్రి రాజకీయాల్లో జోక్యం కారణంగా ఎంపి భరత్ రామ్ తో సఖ్యత లేదన్న మైనస్ తప్ప రాజా పట్ల అధిష్టానం సానుకూలమే అన్నది తెలుస్తుంది. మరోపక్క యువకుడు కావడంతో భవిష్యత్తు ఉందన్న ఆలోచనతో జగన్ మరోసారి అంటూ రాజా కు నో చెప్పే అవకాశాలు లేకపోలేదని ప్రచారం ఉంది. దాడిశెట్టి రాజా రెండుసార్లు ఎమ్యెల్యే గా గెలుపొందగా జక్కంపూడి రాజా మాత్రం తొలిసారి ఎమ్యెల్యే కావడం వల్ల వచ్చేసారి అనే అవకాశాలే ఉన్నాయంటున్నారు. చూడాలి జగన్ కన్నబాబును కొనసాగిస్తారా? లేక మరొకరికి చోటు కల్పిస్తారా? అనేది.