ఒంగోలు, ఆగస్టు 17,
అవును… ఆ మాజీ మంత్రి గురించి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే అంశంపై ఉండడం గమనార్హం. ఎవరైనా నాయకుడు పార్టీ మారితే.. దానివల్ల మరింత మెరుగైన పాలిటిక్స్ చేస్తారని అందరూ అనుకుంటారు. సహజంగా అదే జరుగుతుంది. అందులోనూ ప్రతిపక్ష పార్టీ నుంచి అధికారపక్షంలోకి వస్తే ఓ రేంజ్‌లో చక్రం తిప్పవచ్చు. ఇక గతంలో టీడీపీ నుంచి పార్టీ మారిన వైసీపీ నాయకులకు కూడా పదవులు దక్కాయి. నిధులు కూడా దక్కాయనే పేరుంది. అదేవిధంగా ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన తోట త్రిమూర్తులు సహా పలువురికి మంచి పదవులు దక్కాయి. అయితే..మాజీ మంత్రి.. శిద్దా రాఘవరావు విషయంలో మాత్రం పరిస్థితి యూటర్న్ తీసుకుందనే వాదన వినిపిస్తోంది. టీడీపీ హయాంలో మంత్రిగా వ్యవహరించిన శిద్దా రాఘవరావు సర్కారులో బాగానే చక్రం తిప్పారు. ఐదేళ్లపాటు మంత్రి గా ఉన్నారు. అయితే.. గత ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా దర్శి నుంచి కాకుండా.. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం ఆయన వ్యాపారాలపై వరుస ఎటాక్‌ల నేపథ్యంలో ఆయన కుమారుడు సుధీర్‌తో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. పార్టీ మారిన నాయకులు పుంజుకుంటారనే వాదన మన కు శిద్దా రాఘవ రావు.. విషయంలో కనిపించడం లేదు. కేవలం వ్యాపారాల కోసమే.. ఆయన పార్టీ మారారనే వాదన ఇప్పటికీ వినిపిస్తోంది.నిజానికి రాజకీయాల పరంగా చూసుకుంటే.. శిద్దా రాఘవరావు తోపాటు ఆయన తనయుడుకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాల్సి ఉంది. అదే టీడీపీలో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ, ఇప్పుడు వైసీపీలో ఉండడంతో రాజకీయంగా ప్రకాశం జిల్లాలో ఎక్కడా ఏ నియోజకవర్గంలోనూ శిద్దా రాఘవరావుకు కానీ, ఆయన కుమారుడికి కానీ.. అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. పోనీ..నామినేటెడ్ పదవులు అయినా ..దక్కుతాయా ? అంటే.. ఇప్పటికే చాలా మంది ఈ వరుసలోనూ ఉన్నారు.ప్రకాశం జిల్లాలోనే వైవి, గొట్టిపాటి భరత్, బూచేపల్లి శివప్రసాద్, తూమాటి మాధవరావు లాంటి నేతలు చాలా మందే ఉన్నారు. దీంతో శిద్దా రాఘవరావు తోపాటు ఆయన కుమారుడు కూడా రాజకీయంగా ఎక్కడా దూకుడు చూపించలేక పోవడం గమనార్హం. మరోవైపు.. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన శిద్దా రాఘవరావు సేవలను వినియోగించుకునేందుకు వైసీపీ నేతలు కూడా చొరవ చూపించడం లేదు. వెరసి.. శిద్దా రాజకీయంగా అడకత్తెరలో పడినట్టేనని అంటున్నారు పరిశీలకులు.