YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రుల్లో ధీమా అందుకేనా..?

మంత్రుల్లో ధీమా అందుకేనా..?

అధికారం ఎప్పుడూ కేంద్రీకృతం కాకూడదు. వికేంద్రీకరణ జరిగితేనే నిర్ణయాలు త్వరితగతిన అమలు జరుగుతాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. అన్నీ అధినేత చూసుకుంటాడులే అనే భావం పెరగడంతో మిగతా మంత్రులంతా కాడిని కింద పారేశారు. ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఒకవేళ చొరవ తీసుకుని మాట్లాడితే అధినేత ఏమంటారోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తెలుగుదేశం పార్టీలోని సంస్థాగత లోపాన్ని, అధికార కేంద్రీకరణని బహిర్గతం చేస్తోంది. ఆ సంగతులేంటో ఈ కథనంలో తెలుసుకోండి.

ప్రాంతీయ పార్టీలు అధినేతల కనుసన్నల్లో నడుస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1982లో ఎన్‌.టి.రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటుచేశారు. కొన్నేళ్లు ఆయన సారథ్యంలో కొనసాగిన ఆ పార్టీకి ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వం వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షులుగా ఎన్‌టీఆర్‌ ఉన్నప్పుడు ఆయన అల్లుళ్లలో ఒకరైన చంద్రబాబు టీడీపీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. మరొక అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో వారు స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేవారు. టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చంద్రబాబు చేపట్టిన తర్వాత పార్టీలో కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారు. తెలుగుదేశంలో చంద్రబాబుకి ఉన్న ట్రాక్‌ రికార్డ్‌ మరెవరికీ లేదు. పరిపాలనా దక్షుడిగా ఆయన పేరు పొందారు. అంతేకాదు- ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ని చక్కగా నిర్వహించే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనపై అమిత విశ్వాసం ఏర్పడటంతో క్యాబినెట్‌లో ఉన్న ఇతర మంత్రులు, జిల్లాస్థాయిలో పార్టీ అధ్యక్షులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం లేదు. అన్నీ చంద్రబాబు చూసుకుంటారనే అతి విశ్వాసం, అంతర్గత భయం వారిలో ఏర్పడ్డాయి. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు ఏమంటారోనన్న బెరుకు కూడా వారిలో కనిపిస్తోంది. ఇటీవల జరిగిన రెండు సంఘటనలు ఈ విషయాన్ని మరింత తేటతెల్లం చేశాయి.

కృష్ణాజిల్లాలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయంలో తెలుగు తమ్ముళ్లు సరిగ్గా డీల్ చేయలేకపోయారని పరిశీలకులు అంటున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని, మంత్రి దేవినేని ఉమ.. యలమంచిలి రవితో మాట్లాడారు. తనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వేరే పదవి ఇస్తామని ఆయనకు నేతలు గట్టిగా హామీ ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత యలమంచిలి రవి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా బాబు ఆయనకి పార్టీలో పనిచేయాలని సూచించారు. భవిష్యత్తు సంగతి తాను చూసుకుంటానని అన్నారు. అయితే అప్పటికే నాలుగేళ్లపాటు పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లభించలేదన్న భావనతో ఉన్న యలమంచిలి రవి తన దారి తాను చూసుకున్నారు. రవి వలన పార్టీకి ఉపయోగం ఉందా లేదా అనే అంశాన్ని పక్కనపెడితే, ఎన్నికల సంవత్సరంలో ఒక నేత పార్టీని వదిలి వెళ్లడమనేది మంచి సంకేతాలు ఇవ్వదు. అదే సమయంలో ఆయన అనుచరులు పార్టీకి వ్యతిరేకంగా చేసే ప్రచారం కూడా నష్టం చేస్తుందన్న మాట వాస్తవం!

మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ వ్యవహారంలోనూ ఇలాగే జరిగింది. వ్యాపారవేత్త అయిన కృష్ణప్రసాద్‌ను గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి పత్తిపాటి పుల్లారావు చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. గుంటూరు జిల్లాలో పనిచేయాలనీ, ఎన్నికల సమయంలో అంతా తాను చూసుకుంటాననీ చంద్రబాబు చెప్పారు. ఒకవేళ చివరి నిముషంలో తనకు సీటు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటని కృష్ణప్రసాద్ పునరాలోచనలో పడ్డారు. ఇదే సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వసంత కృష్ణప్రసాద్‌కు మైలవరం టిక్కెట్ ఇస్తామని ఆఫర్ చేసింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన కృష్ణప్రసాద్ అటువైపు మొగ్గుచూపారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు కూడా ఆయనకి టాచ్‌లోకి వెళ్లారు.

కృష్ణాజిల్లాలో కమ్మ సామాజికవర్గం నుంచి నేతలను తమ వైపు లాక్కునేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలుగుదేశంలో మాత్రం ఆ వ్యూహం కనిపించడంలేదు. కృష్ణప్రసాద్ విషయానికే వస్తే.. ఆయన మైలవరం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ అతి తక్కువ మెజారిటీతో ఉమ గెలుపొందారు. మంత్రిగా ఉన్న ఉమ రెండున్నరేళ్ల పాటు నియోజకవర్గంపై అంతగా దృష్టి సారించలేదు. గత సంవత్సర కాలంనుంచి నియోజకవర్గంపై పట్టుపెంచుకునే ప్రయత్నాన్ని ప్రారంభించారు. ప్రతి రోజూ నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. గ్రామప్రాంతాల్లోని పార్టీ నేతల మధ్య ఉండే విభేదాలను పరిష్కరిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల పట్టాలను మంజూరు చేయించారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నారు. నియోజకవర్గంలో మెజారిటీ ప్రాంతానికి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు, తాగునీరు అందించడం ద్వారా స్థానికంగా ప్రజల్లో ఉమ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సంస్థాగతంగా ఉన్న లోపాలను కూడా సరిదిద్దుకుంటున్నారు. మైలవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మెరుగుపడిందని హైకమాండ్‌కు కూడా ఇటీవల నివేదిక అందింది.

వసంత కృష్ణప్రసాద్ ఆర్ధికంగా స్థితిమంతుడు. ఒకవేళ ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసినా తట్టుకుని రాజకీయంగా నిలబడగలగాలి అనే ధ్యేయంతో ఉమ పనిచేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణప్రసాద్‌ను గుంటూరు జిల్లాలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేయించాలని అక్కడ టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు నుంచి హామీ లభిస్తేనే పార్టీలో ఉండాలని కృష్ణప్రసాద్ తలపోస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీలో అధికారం కేంద్రీకృతం కావడంతో ద్వితీయశ్రేణి నేతలు, మంత్రులు ఎవరికి వాళ్లు తమకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు. చివరకు నియోజకవర్గాల్లో ఉన్న చిన్నచిన్న విభేదాలను కూడా పరిష్కరించలేకపోతున్నారు. దీంతో అవి ముదిరిపోయి, నేతల మధ్య మాటలు కూడా కరువయ్యాయి. ఇప్పుడు కాయకల్ప చికిత్స చేయాలన్నా సాధ్యం కావడంలేదు. ఎన్నికల సంవత్సరంలో సమష్టిగా కదలాల్సిన తెలుగుదేశం శ్రేణులు విభేదాలతో సతమతమవడం, అధికారం కేంద్రీకృతం కావడం పార్టీ సీనియర్ నేతలను కలవరపెడుతోంది.

Related Posts