అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే తమ లక్ష్యం
అఫ్ఘన్ నుంచి బలగాల ఉపసంహరణను సమర్థించుకున్న అమెరికా
అఫ్గాన్లోని ప్రస్తుత పరిణామాలు విచారకరం
అఫ్ఘన్ ప్రజలకు అమెరికా మద్దతు కొనసాగుతుంది: : జో బైడెన్
న్యూ ఢిల్లీ ఆగష్టు 17
అఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో, బలగాల ఉపసంహరణపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్ఘన్ నుంచి బలగాల ఉపసంహరణను సమర్థించుకున్నారు.అఫ్ఘన్‌ను తాలిబాన్లు ఆక్రమించిన నేపథ్యంలో అమెరికా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటిని జోబైడెన్ తోసిపుచ్చారు. ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. 9/11 ఘటన ఆర్వాత అల్ ఖైదాతో సంబంధాల కోసం తాలిబన్లను శిక్షించే దాని ప్రారంభ లక్ష్యాలకు మించి విస్తరించిన యుద్ధాన్ని ఆపడమే ప్రాధాన్యం అన్నారు. అఫ్ఘనిస్తాన్‌లో కేంద్రీకృత ప్రజాస్వామ్యం నిర్మించడం తమ లక్ష్యం కాదన్నారు. అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. శాశ్వత సైనిక ఉనికి లేని దేశాల్లో ఉగ్రవాదంపై పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అమెరికా దళాలు నిష్క్రమించినప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. తాలిబాన్లు మళ్లీ దాడులను ప్రారంభిస్తే ‘వినాశకరమైన’ సైనిక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.20 సంవత్సరాల తర్వాత బలగాలను వెనక్కి పిలిచేందుకు ఇదే సరైన సమయమని భావించినట్లు పేర్కొన్నారు. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని, అయితే ఊహించినదానికంటే వేగంగా అఫ్ఘనిస్తాన్ వేగంగా తాలిబాన్ల వశమైందన్నారు. అయితే, తనకు ఎలాంటి విచారం లేదని ఆయన పునరుద్ఘాటించారు. సోమవారం వైట్‌హౌస్ నుంచి చేసిన టెలివిజన్ ప్రసంగంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.అఫ్గాన్లోని ప్రస్తుత పరిణామాలు.. విచారకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్ఘన్ ప్రజలకు అమెరికా మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ప్రాంతీయ దౌత్యం కోసం ఆఫ్ఘన్ హక్కుల కోసం పాటుపడుతుందన్నారు. ప్రస్తుతం అఫ్ఘన్‌లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. వేగంగా ప్రతిస్పందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో బిన్‌లాడెన్‌ను పట్టుకునేందుకు తాము వెనక్కి తగ్గలేదని, ప్రస్తుతం అఫ్ఘనిస్తాన్ కేంద్రంగా అమెరికాపై ఆల్‌ఖైదా దాడి చేయలేదని, 20 ఏళ్ల కిందటనే ఖచ్చితమైన ప్రణాళికతో అఫ్ఘన్ వెళ్లి ఆల్‌ఖైదాను అంతం చేశామన్నారు.