YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖమ్మంపైనే దృష్టి

 ఖమ్మంపైనే దృష్టి

రెండు జిల్లాల పరిధిలో ఉన్న మూడు జనరల్‌ శాసనసభ సీట్లపై పార్టీల నజర్‌ పడింది. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం జనరల్‌ స్థానాలు కాగా..పట్టు పెంచుకునేందుకు చేస్తున్న అంతర్గత కసరత్తు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలకు గాను సత్తుపల్లి, మధిర ఎస్సీ నియోజకవర్గాలుగా,ఇల్లెందు, వైరా, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట ఎస్టీ నియోజకవర్గాలుగా ఉన్నాయి. జనరల్‌ సీట్లలో టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఖాయమన్న భరోసా ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఉత్సాహం నిండింది. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ అన్ని స్థానాల్లో పోటీ చేసినా..కొత్తగూడెంలో మాత్రమే జలగం వెంకటరావు పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన పువ్వాడ అజయ్‌కుమార్‌ తదనంతర రాజకీయ పరిణామాల్లో అధికార పార్టీ తీర్థం పుచ్చుకోగా.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం పాలేరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.  

2014ఎన్నికల అనంతరం టీడీపీకి రాజీనామా చేసి తన అనుచర గణంతో పెద్ద ఎత్తున అధికార పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు కొద్ది కాలానికే మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన మాజీమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్య కారణాలతో మృతిచెందడంతో ఖాళీ అయిన స్థానంలో మంత్రి తుమ్మల 2016లో పోటీ చేసి విజయం సాధించారు. మంత్రి తుమ్మల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఓటర్లకు, కార్యకర్తలకు చేరువ కావడానికి గల మార్గాలను అన్వేషిస్తూ..అత్యధికంగా పర్యటించేందుకు మక్కువ చూపుతున్నారు. వారంలో నాలుగు రోజులపాటు జిల్లాలో మకాం వేస్తుండగా.. ఆ నాలుగు రోజుల్లో ప్రతిరోజూ తన నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దిశానిర్దేశం చేయడం వంటివి చేస్తున్నారు.

కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకటరావు సైతం అత్యధికంగా నియోజకవర్గ అభివృద్ధి పనులపై దృష్టి సారించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి,  మెజార్టీని మరింత పెంచుకోవడానికి గల అవకాశాలను, రాజకీయ సమీకరణలను బేరీజు వేసుకుంటూ..తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు.

పార్టీ కార్యక్రమాలకు  మంత్రులను ఆహ్వానించడం, పార్టీ నేతలు తన నియోజకవర్గంలో పర్యటించేలా ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలు అనునిత్యం జరిగేలా.. తద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేలా చెమటోడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తులను చల్లార్చేందుకు ఎవరికి వారే తమదైన ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

ఖమ్మం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీ హబ్, సుడా వంటివి మంజూరు చేసుకోవడం ద్వారా..నియోజకవర్గానికి ప్రోత్సాహకం కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్న భావన నెలకొనేలా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలోనే అత్యధికంగా ఉంటూ..ప్రతిరోజూ అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. తద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో అసంతృప్తి సెగలను ప్రజ్వరిల్లకుండా ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో నెలకొంది. రాజకీయంగా ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు అత్యంత పట్టుంది. పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి 2004లో గెలుపొందిన సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావులు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేయడంతో ఈ నియోజకవర్గాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు వచ్చింది. కమ్యూనిస్టుల ఖిల్లాగా ఒకప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్‌కు బలమైన పట్టున్న ప్రాంతంగా ప్రసిద్ధి గాంచిన ఖమ్మం సైతం రాజకీయంగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందినదే.

ఈ మూడు నియోజకవర్గాలను కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకోవాలని, తద్వారా జిల్లాలో బలమైన పునాదులున్నాయని నిరూపించుకునేందుకు తపన పడుతోంది. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ కార్యకర్తల ఆలనా పాలన చూసే నియోజకవర్గస్థాయి ఇన్‌చార్జ్‌లు ఇప్పటి వరకు లేరు. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీలో అంతర్గత పోరు రాజ్యమేలుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఈ సారి పోటీ చేసేందుకు జిల్లా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు తనవంతు ప్రయత్నాలు చేస్తుండగా..గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన వనమాపై ఎడవల్లి కృష్ణ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయడం, కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఐ అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు పోటీ చేయడంతో ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జలగం వెంకటరావు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామ క్రమంలో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ గూటికి చేరగా..ఆయనకు స్వయాన తోడల్లుడైన ఎడవల్లి కృష్ణ సైతం కాంగ్రెస్‌ పార్టీలో మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి ఆశీస్సులతో చేరారు. ఈ నియోజకవర్గంలో ఇరువురు నేతలు హోరాహోరీగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరికి వారేగా మారి..ఆశీస్సులు అందించే నేతలపై పూర్తి భారాన్ని వేస్తున్నారు.   పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడును తలపిస్తున్నా..పార్టీలో ఉన్న కార్యకర్తల భుజాన చేయి వేసి ఆపద వస్తే అక్కున చేర్చుకునే నేత పూర్తిస్థాయిలో కనపడట్లేదన్న ఆవేదన, ఆందోళన వ్యక్తమవుతోంది.  

టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలను ఈ నియోజకవర్గాల నుంచి ఎదుర్కొనే కాంగ్రెస్‌ నేతలు ఎవరనేది కార్యకర్తలకే అంతుచిక్కట్లేదు. తమ నియోజకవర్గాలకు బాహుబలి నేతలు వస్తే బాగుంటుందని, వారు ఎవరి రూపంలో సాక్షాత్కరిస్తారో తెలియని పరిస్థితి ఉందని కాంగ్రెస్‌ కార్యకర్తలు నొసలు చిట్లిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ, సీపీఐ వంటి పక్షాలు ఎన్నికల మైత్రి కుదుర్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో ఎవరి ఆశలు చిగురిస్తాయో..ఎవరికి ఆశాభంగం కలుగుతుందో మిత్ర పక్షాలు పోటీ చేసేందుకు దక్కే స్థానాలు ఏ విధంగా ఉంటాయోనన్న అంశం పార్టీ వర్గాల్లో ఉత్కంఠతను రేపుతోంది.

Related Posts