అగ్రరాజ్యం అమెరికాలో నీటి కొరత
వాషింగ్టన్ ఆగష్టు 17
అగ్రరాజ్యమైన అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు నీటి కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తమ లేక్ మీడ్ జలాశయంలో నీరు అడుగంటి పోయిందని అమెరికా తొలిసారి అంగీకరించింది. ప్రభుత్వం ప్రకారం, ఈ జలాశయంలో 10 అడుగుల వరకు మాత్రమే నీరు ఉన్నది. ఇది కొన్ని రాష్ట్రాలపై నేరుగా ప్రభావం చూపుతున్నది. రిజర్వాయర్‌లో నీటి కొరత కారణంగా అరిజోనా, నవాడా, మెక్సికోకు అందించే నీటిలో కోత విధించే అవకాశాలు ఉన్నాయని యూఎస్ బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం, అరిజోనాలో దాదాపు 18 శాతం, నవాడాలో 7 శాతం, మెక్సికోలో 5 శాతం నీరు తగ్గుదల ఉండనున్నది. నీటి కరువును ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సాయం అందించాలని 10 రాష్ట్రాలు అమెరికా ప్రభుత్వానికి నివేదించాయి. చరిత్రలో అతిపెద్ద కరువుగా ప్రెసిడెంట్ బైడెన్‌కు రాసిన లేఖలో గవర్నర్లు అభివర్ణించారు. నీటి కరువు కారణంగా మొత్తం పంటలు నాశనమయ్యాయని వారు తెలిపారు. ఫలితంగా అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చునని వారు బైడెన్‌కు విన్నవించారు.దాంతో 10 రాష్ట్రాల గవర్నర్లు తమ రాష్ట్రాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని, దీని కింద ఆర్థిక సహాయం అందించాలని జో బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు.దేశంలోని పశ్చిమ ప్రాంతంలో దాదాపు 63 శాతం నీటి కొరత ఉన్నట్లు యూఎస్ డ్రాఫ్ట్ మానిటర్ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం, పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న ఈ రాష్ట్రాల్లో దాదాపు ఆరు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. 1930 లో నిర్మించిన అతిపెద్ద రిజర్వాయర్ అయిన మీడ్ సరస్సు.. అమెరికాలోని నవాడా-అరిజోనా సరిహద్దులో ఉన్నది.