గుంటూరు, ఆగస్టు 18,
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. హామీలు ఇచ్చి కూడా మరిచిపోవచ్చు. సమయానికి తగిన సేవ చేయించుకుని తర్వాత.. పక్కన పెట్టొచ్చు. ఇప్పుడు ఇలాంటి పరాభవంతోనే కుమిలిపోతున్నారు.. గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు. ఈ నలుగురు కూడా గత ఎన్నికల సమయంలో టికెట్లను త్యాగం చేసి.. జగన్ మాటపై విశ్వాసంతో.. పార్టీ కోసం పనిచేశారు. పార్టీని గెలిపించేందుకు కృషి చేశారు. ఈ క్రమంలో జగన్.. ఆయా నేతలకు గట్టి హామీలే ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు అంటే.. అధికారం చేపట్టి.. రెండున్నరేళ్లు గడిచిపోయినా.. వీరిని కనీసం పట్టించుకోకపోవడం దారుణమని అంటున్నారు వీరి అనుచరులు.విషయంలోకి వెళ్తే.. టీడీపీకి బలమైన కంచుకోటగా ఉన్న వినుకొండ నియోజకవర్గంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న జీవీ ఆంజనేయులును ఓడించేందుకు వైసీపీ కీలక అస్త్రం ప్రయోగించింది. ఆయనే మక్కిన మల్లికార్జున రావు. గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి.. లావు శ్రీకృష్ణదేవరాయలు.. ఈయనను ముందు పెట్టి.. ఇక్కడ రాజకీయం నడిపించారు. ఈ క్రమంలో వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు.. విజయం దక్కించుకున్నారు. అయితే.. ఎన్నికల సమయంలో నామినేటెడ్ పదవికానీ.. ఎమ్మెల్సీ కానీ.. ఇస్తామని ఆశపెట్టినా.. తర్వాత.. మక్కినను అటు లావు, ఇటు జగన్ ఎవరూ పట్టించుకోలేదు. ఇక, మరో టీడీపీ కంచుకోట.. పొన్నూరు. ఇక్కడ వరుసగా ఐదు ఎన్నికల్లోనూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విజయం దక్కించుకున్నారు. అయితే.. ఇక్కడ రావి వెంకటరమణను వాడుకున్న వైసీపీ.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయనను ఇక్కడ ఇంచార్జ్‌గా ఉంచింది. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి పొన్నూరు ఇన్‌చార్జ్‌గా ఆయనే ఉన్నారు. అయితే.. ఎన్నికల సమయానికి ఆయనను పక్కన పెట్టి.. కిలారు రోశయ్యకు టికెట్ ఇచ్చారు. టికెట్ త్యాగం చేయడంతోపాటు.. రోశయ్య గెలుపునకు రావి బాగా కృషి చేశారు. అయితే.. ఆయనను కూడా ఇప్పటి వరకు జగన్ పట్టించుకోలేదు. చివరకు ఇటీవల నామినేటెడ్ పదవులు ఇచ్చినా రావి పేరు పరిగణలోకి తీసుకోలేదు.మరో నేత గురించి చూస్తే.. దేవినేని మల్లికార్జున రావు. ఈయనను ఏకంగా రెండు నియోజకవర్గాల్లో వాడుకున్నారు. అటు వేమూరు, ఇటు రేపల్లె నియోజకవర్గాల్లో ఆయన సేవలు వినియోగించుకుని గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే.. రేపల్లె తప్ప వేమూరులో వైసీపీ విజయం దక్కించుకుంది. కానీ.. మల్లికార్జున రావును మాత్రం అందరూ మరిచిపోయారు. ఎన్నికల వేళ మల్లిఖార్జున రావును పనిగట్టుకుని మోపిదేవి, మేరుగ నాగార్జున జగన్ దగ్గరకు తీసుకువెళ్లి పార్టీలో చేర్చుకున్నారు. అదే సమయంలో గత ఎన్నికల సమయంలో మరో కీలక నియోజకవర్గం.. చిలకలూరిపేట టికెట్‌ను త్యాగం చేసిన మర్రి రాజశేఖర్‌కు పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తానని… స్వయంగా జగనే బహిరంగ వేదికపై హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఎమ్మెల్సీనే ఇవ్వలేదు. దీంతో ఈ నలుగురు కమ్మసామాజిక వర్గానికి చెందిన నేతలకు జగన్ హ్యాండిచ్చారా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.