హైదరాబాద్, ఆగస్టు 18,
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బయపడింది. దీంతో ఉన్న ఉద్యోగులకే కాదు.. కొత్తగా కొలువులు వస్తాయని ఆశపడుతున్న నిరుద్యోగులకు కూడా కష్టాలు రానున్నాయి. నిర్ణీత వ్యవధిలో ఉద్యోగుల విభజన, బదిలీల ప్రక్రియ పూర్తి చేయకుంటే మళ్లీ ఫైల్ ఢిల్లీకి చేరాల్సిందే. అక్కడి నుంచి తిరిగి అనుమతి వస్తేనే ఈ ప్రక్రియ మొదలుకానుంది. పాత ఉద్యోగుల బదిలీలు, కొత్త ఉద్యోగాల భర్తీని తేల్చేందుకు ఇంకా 14 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. దాదాపుగా 36 నెలల పాటు స్తబ్ధుగా ఉన్న ప్రభుత్వం ఆఖరి నిమిషంలో హడావుడి చేస్తోంది. రాష్ట్రపతి విభజన ఉత్తర్వుల ప్రకారం ఈ నెలాఖరులోగా ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల విభజన, బదిలీలు, ఆఫ్షన్లు, కేటాయింపులు, సర్దుబాటు ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సిందే. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 36 నెలల కాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, లేకుంటే మళ్లీ రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాలంటూ స్పష్టం చేసింది.ఉద్యోగుల విభజనకు కౌంట్డౌన్ మొదలైంది. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఈ నెల 31లోగా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. 2018 ఆగస్టు 30న రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీనిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగుల విభజన, జోనల్, మల్టీజోనల్ తదితర అంశాన్ని స్పష్టం చేస్తూ రాష్ట్రపతి గెజిట్కు అనుబంధంగా తెలంగాణ ప్రభుత్వం అదే రోజున జీవో జారీ చేసింది. రాష్ట్రప్రభుత్వం నిర్ణీత 36 నెలల్లో పూర్తి చేయాలని తేల్చింది. ఒకవేళ ఈ గడువులోగా పూర్తి చేయకుంటే తిరిగి రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాలని వెల్లడించారు.దాదాపు 9 నెలల నుంచి సాగుతున్న ఉద్యోగుల విభజన, ఖాళీల భర్తీపై ప్రభుత్వం హడావుడి మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఇటీవల ఒకేసారి 87 జీవోలను జారీ చేశారు. గడువు ముంచుకువస్తుండటంతో అధికారులను ప్రగతిభవన్లో కూర్చెండబెట్టి జీవోలు జారీ చేశారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే పాత ఉద్యోగుల సర్దుబాటు, ఆఫ్షన్ల ప్రక్రియ మొత్తం 18 రోజుల్లో పూర్తి చేయాలంటూ వారం రోజుల కిందట ఆదేశాలిచ్చారు. కానీ ఇప్పటికీ ఇంకా ముందుకు పడలేదు. వాస్తవంగా ఉద్యోగుల ఆఫ్షన్లపై సోమవారం ఉదయమే సర్క్యులర్లు వస్తాయని భావించారు. రాత్రి వరకు కూడా ఎలాంటి ఆదేశాలివ్వలేదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హుజురాబాద్కు వెళ్లడంతో దీనిపై ఉత్తర్వులు రాలేదని అధికారులు చెప్పుతున్నారు. నేటి నుంచైనా ఆఫ్షన్లకు అవకాశం ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వీటిపై ప్రతి జిల్లాకు ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్షన్లకు కూడా ఆదేశాలు రాకపోవడంతో ఉద్యోగుల మెడపై విభజన కత్తి వేలాడుతోంది. మళ్లీ దీని కోసం అధికారులు హడావుడి చేస్తే ఉద్యోగవర్గాలు ఆందోళనకు గురయ్యే అవకాశాలున్నాయి.మరోవైపు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య ఇంకా పంచాయతీ తేలలేదు. కేడర్ స్ట్రెంత్ నిర్థారించి, కొత్త జిల్లాల వారీగా పోస్టులను ఖరారు చేసి, ఆర్డర్ టూ సర్వ్ను రద్దు చేసిన తర్వాతే బదిలీలు, సర్దుబాటు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు పట్టుపడుతున్నాయి. అంతేకాకుండా మొత్తం ఉద్యోగులకు కాకుండా కొత్త జిల్లాల పరిధిలోకి ఆర్డర్ టూ సర్వ్ కింద పని చేస్తున్న వారికి ఆఫ్షన్లు ఇవ్వాలని కూడా డిమాండ్ ఉంది. ఇవన్నీ తేల్చిన తర్వాతే ఖాళీలపై నివేదిక వస్తుందని, ఇప్పుడు చూపిస్తున్న ఖాళీలపై వివరాలు లేవని, ప్రక్రియ పూర్తి చేసేంత వరకు నివేదిక ఇవ్వరాదంటూ అల్టిమేటం ఇచ్చాయి. దీనికి కొంతమంది ఉన్నతాధికారులు ఒప్పుకున్నా… ఆర్థికశాఖలోని ఓ సీనియర్ ఐఏఎస్ మాత్రం అడ్డుపడుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుతున్నారు.రాష్ట్రపతి విభజన ఉత్తర్వుల గడువు ముంచుకువస్తుండటంతో ఉద్యోగులు, నిరుద్యోగులకు కష్టకాలం ఎదురవుతోంది. రాష్ట్రంలో 50 వేల కొలువులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి 9 నెలలు గడిచిపోయింది. మరోవైపు ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే స్పష్టమైన వివరాలు లేవని అధికార యంత్రాంగం చెప్పుతోంది. ముందుగా 45 వేలు, ఆ తర్వాత 50 వేలు, మళ్లీ 56 వేలు ఖాళీలున్నాయని నివేదికలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ స్పష్టమైన రిపోర్ట్ ఇవ్వలేదు. అటు పీఆర్సీ కమిషన్ మాత్రం 1.91లక్షల ఖాళీలున్నట్లు రిపోర్టులో స్పష్టం చేసింది. దీంతో ఖాళీలపై అంతా ఆయోమయం నెలకొంది. అయితే ఖాళీల నివేదిక వచ్చిన తర్వాతే కొత్త కొలువులకు నోటిఫికేషన్ వస్తుందని అధికారులు స్పష్టంగా చెప్పుతున్నారు. కానీ ఉద్యోగుల విభజన ప్రక్రియకు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి చేస్తేనే కొత్త కొలువులపై ఆశలు సజీవం కానున్నాయి. కానీ ప్రస్తుత 14 రోజుల వ్యవధిలో పాత ఉద్యోగుల సర్దుబాటు పూర్తవుతుందనే నమ్మకం లేదని అధికారవర్గాలే చెప్పుతున్నాయి.మరోవైపు ఇటీవల జోనల్ విధానంపై రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. 31 జిల్లాలకు 2018 ఆగస్టులోనే ప్రెసిడెంట్ ఉత్తర్వులు ఉండటంతో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. 33 జిల్లాల సవరణ గెజిట్ వచ్చినా.. పాత తేదీ వర్తిస్తుందని, దీన్ని గెజిట్లో కూడా పేర్కొన్నట్లు చెప్పుతున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఇప్పుడు విభజన అంశాలపై ఎలాంటి జీవో జారీ చేసినా 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే అన్నట్టుగా పేర్కొంటోంది. ఈ లెక్కన ఈ నెలాఖరులోగా ఉద్యోగుల విభజన ప్రక్రియ తేల్చకుంటే రాష్ట్రంలోని రెండు వర్గాల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పేలా లేదు.