YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అయ్యన్న స్టెప్ ఏంటి..?

అయ్యన్న స్టెప్ ఏంటి..?

ఒకప్పుడు తంగేడు రాజుల కుటుంబంలో వారసత్వ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేసిన అయ్యన్నపాత్రుడు తన రాజకీయ వారసత్వాన్ని ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయ్యన్న పెద్ద కుమారుడు విజయ్‌ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో అనేక సంవత్సరాలుగా అందుకు సన్నద్ధమవుతున్నారు. దేశవిదేశాల్లో రాజకీయ నాయకత్వంపై కోర్సులు చదవడమే కాకుండా ఎన్నికల్లో తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఆయన గెలుపునకు తనవంతు కృషి జరుపుతున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయాలని యత్నించిన విజయ్‌కు అవకాశం రాకపోవడంతో, ఈసారి ఏవిధంగానైనా ఎన్నికల్లో పోటీ చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టుగా ఆయన వర్గీయులు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో వుంటూ ఆరుసార్లు ఎంఎల్‌ఏగా, ఐదుసార్లు రాష్ట్ర మంత్రిగా ఒకసారి ఎంపిగా పదవులు నిర్వహించిన అయ్యన్నపాత్రుడు కొద్ది సంవత్సరాలుగా రాజకీయ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి కెబినేట్‌లో మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్న అయ్యన్న మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? లేక వారసుడిని రంగంలోకి దింపుతారా? అనేది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. నర్సీపట్నం నియోజకవర్గంలో మళ్లీ గెలుపు తమదేనన్నా ధీమా టీడీపీ వర్గీయల్లో వ్యక్తమవుతుంది. అయితే గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌కే మళ్లీ టిక్కెట్‌ ఇస్తే పోటీ గట్టిగానే ఉంటుందంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడు పోటీ చేస్తారా?, తనయుడు విజయ్‌ను బరిలోకి దింపుతారా అనే స్పష్టత రావడానికి మరికొన్ని రోజులుగా వేచి చూడక తప్పదు. అయితే ఈ లోగా థియరీ రాజకీయాలు నేర్చుకున్న తనయుడుకు, ప్రాక్టికల్‌గా రాజకీయాలు ఎలా వుంటాయో నేర్పేందుకు మంత్రి అయ్యన్నపాత్రుడు గత కొద్ది నెలలుగా నియోజకవర్గంలో తను పాల్గొనే ప్రతి కార్యక్రమానికి వెంటబెట్టుకొని వెళుతున్నారు.

పార్టీలో ఎటువంటి పదవులు లేకపోయినా, తన తండ్రికి అండగా వుంటున్న విజయ్‌ ఇప్పటికే నియోజకవర్గంపై రాజకీయంగా కొంత పట్టు సాధించగలిగారు. మంత్రి అయ్యన్నతో పాటు సతీమణి పద్మావతి, తనయులు విజయ్‌, రాజేష్‌ నలుగురు నియోజకవర్గంలో నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. దాంతో అయ్యన్న కుటుంబం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనేది అసక్తికరంగా మారింది. పార్టీపరంగా చేపట్టిన కార్యక్రమాల్లో మంత్రి అయ్యన్నతో పాటు తనయుడు విజయ్‌ కూడా చురుకుగా పాల్గొంటున్నారు. పార్టీ అధినేత అభిప్రాయం ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల్లో ఎదో ఒక స్ధానానికి పోటీ చేయాలన్న కాంక్ష అయ్యన్న తనయుడులో అధికంగా ఉంది. దాంతో నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తండ్రా! లేక తనయుడా! అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Posts