హైదరాబాద్, ఆగస్టు 18,
కొత్త లిక్కర్ పాలసీపై దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. జీఎస్టీ తర్వాత ఖజానాకు అధిక ఆదాయం ఎక్సైజ్ శాఖ నుంచే వస్తోంది. దీంతో ఈ ఏడాది మద్యం అమ్మకాలు, షాపుల వేలం ద్వారా ఈ ఏడాది దాదాపు 12 వందల కోట్ల రూపాయలు ఆర్జించాలని తెలంగాణ ఎక్స్జైజ్ శాఖ టార్గెట్ గా పెట్టుకుంది. తాజా లెక్కల ప్రకారం ఖజానాకు ఏటా 24 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుండటంతో.. మద్యం అమ్మకాలపై మరింత ఫోకస్ పెడుతోంది తెలంగాణ సర్కార్. అక్టోబర్‌లో మద్యం షాపుల లైసెన్స్ గడువు ముగియనుండటంతో… ఇప్పటినుంచే కొత్త మద్యం పాలసీని అమలు చేసేందుకు ప్లాన్ చేసింది.రాష్ట్రంలో మొత్తం 200 లిక్కర్ స్టోర్‌లు.. 2,216కు పైగా లిక్కర్ షాపులు… హైదరాబాద్ అడ్డాగా పదుల సంఖ్యలో పబ్బులు, వందల సంఖ్యలో బార్లు ఉన్నాయి. మందు బాబుల ద్వారా ఏటా.. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురుస్తుంది. 2019 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు రెండేళ్ల లైసెన్స్ గడువు కోసం షాపులు, బార్లు, లిక్కర్ స్టోర్‌ల ఓనర్లు టెండర్లలో పాల్గొన్నారు. ఈ టెండర్ల ద్వారా… రెండేళ్లకు గాను కేవలం లైసెన్స్ కోసమే ఎక్సైజ్ శాఖకు 600 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. అయితే… ఈ అక్టోబర్‌తో గడువు ముగియనుంది. దీంతో కొత్త టెండర్లు వేయాలని బిడ్డర్లను ఆహ్వానించేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది.రాష్ట్రం ఏర్పడ్డాక… 80 కొత్త బార్లకు అనుమతిచ్చింది ఎక్సైజ్ శాఖ. అయితే… పలు కారణాల వల్ల లైసెన్స్ పొందిన షాపులు.. నిర్వహణలో లేవని ఎక్సైజ్ శాఖ లెక్కల్లో తేలాయి. వీటి స్థానంలో మరో 200 కొత్త లిక్కర్ స్టోర్లకు అనుమతినివ్వాలని ప్రణాళికలు వేస్తోంది ప్రభుత్వం. మండలాలు, మున్సిపాలిటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అధికంగా జరిగే ప్రాంతాల్‌లో లిక్కర్ షాపులకు అనుమతివ్వాలన్నది ఎక్సైజ్ శాఖ ఆలోచనగా తెలుస్తోంది. కొత్తగా రానున్న మద్యం పాలసీలో… వేలం కోసం దరఖాస్తు ఫీజును కూడా పెంచాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. దీని ద్వారా దాదాపు 12 వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు అధికారులు.2015-17 వేలం సమయంలో దరఖాస్తు ఫీజు 50 వేల రూపాయలుండగా… గత వేలం పాటలో దీని ధరను లక్ష రూపాయలకు పెంచారు. తాజాగా… రానున్న మద్యం పాలసీలో వేలంలో పాల్గొనే వారి దగ్గర నుంచి 3 లక్షల రూపాయలను ఫీజుగా వసూలు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 4 స్లాబుల్లో లైసెన్స్ ఫీజులున్నాయి. 45 లక్షలు… 50 లక్షలు… 80 లక్షలు… కోటి 20 లక్షల రూపాయల స్లాబులుగా నిర్ణయించింది ప్రభుత్వం. లైసెన్స్‌ల ధరలను పెంచే యోచనతో కొన్ని ఏరియాల్లో 5 శాతం నుంచి 8 శాతం వరకు పెంచే అవకాశం ఉంది.