YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బెజవాడలో గతితప్పుతున్న ఫ్యాన్

బెజవాడలో గతితప్పుతున్న ఫ్యాన్

వైసీపీలో అంతర్యుద్ధం మొదలయింది. పార్టీ అధినేత జగన్‌ పాదయాత్ర జిల్లాలో కొనసాగుతుండగానే నగర నాయకులు అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలుతున్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వెలంపల్లికి చెక్‌ పెట్టేందుకు వంగవీటి రాధా తన వర్గం నాయకులను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా మాజీ కార్పొరేటర్‌ కోరాడ విజయకుమార్‌ను తెరపైకి తీసుకొచ్చారు. వెలంపల్లికి నియోజకవర్గంలో పట్టు లేదని, అలాంటి వ్యక్తికి టికెట్‌ ఎలా ఇస్తారని రాధా వర్గం ప్రచారం చేస్తోంది.

వైసీపీ విజయవాడ నగరాధ్యక్షుడిగా ఉన్న వెలంపల్లి శ్రీనివాస్‌కు చెక్‌ పెట్టేందుకు పార్టీలోని ఆయన వైరి వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నగర పరిధిలోని నియోజకవర్గాల్లో తమ ప్రమేయం లేకుండా.. తమను సంప్రదించ కుండానే పార్టీ పదవు ల్లో తన వర్గం నేతలను వెలంపల్లి తెచ్చిపెడుతున్నారని ఆయన వైరివర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో వైసీపీ నగరాధ్యక్షుడిగా చేసిన వంగవీటి రాధా అనుచరులు వెల్లంపల్లి అంటే భగ్గుమంటున్నారు. గతంలో అత్యంత సన్నిహితంగా మెలిగిన రాధా, వెలంపల్లి అనంతర కాలంలో బద్ధవిరోధులుగా మారారు. వైసీపీ నగర అధ్యక్షుడిగా వెల్లంపల్లి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీరి నడుమ దూరం మరింత పెరుగుతూ వస్తోంది. వెల్లంపల్లి రాకతో తన వర్గానికి ప్రాధాన్యం తగ్గుతోందని రాధా భావిస్తున్నారు. పశ్చిమ, సెంట్రల్‌, తూర్పు నియోజకవర్గాల్లో పార్టీ పదవులను తన వర్గం వారితో వెలంపల్లి భర్తీ చేస్తూ వస్తున్నారు. దీంతో వెలంపల్లి ఉద్దేశ పూర్వకంగానే తమను పక్కన పెడుతు న్నారని రాధా అనుచరుగణం భావిస్తున్నారు. ఎలాగైనా వెలంపల్లికి చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతో పశ్చిమ నియోజక వర్గంలో తన వర్గం నాయకులను రాధా ప్రోత్సహిస్తున్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వెలంపల్లి వైసీపీ సీటు ఆశిస్తున్నారు. 2009లో ఇదే స్థానం నుంచి ఆయన ప్రజా రాజ్యం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌లోకి అక్కడి నుంచి బీజేపీ చివరికి వైసీపీలో చేరారు. పశ్చిమ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వెలంపల్లికి ఎలాగైనా సీటు దక్కకుండా చూడాలన్న ఉద్దేశంతో రాధా పావులు కదుపుతున్నారు. వెలంపల్లికి చెక్‌ పెట్టేందుకు తన వర్గం నాయకులను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో సీపీఎంలో పనిచేసిన కోరాడ విజయకుమార్‌ను రాధా తెరపైకి తీసు కొచ్చారు. కోరాడ గతంలో కార్పొరేటర్‌గా పని చేశారు. ఆయన కుటుంబానికి రాజకీయంగా మంచి పేరు ఉండటం, ఆర్థికంగా కోరాడ బలంగా ఉండటంతో రాధా ఎలాగైనా కోరాడను పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నారు. రాధా ఆశీస్సులతోనే కోరాడ విజయకుమార్‌ ‘కోరాడ ట్రస్టు’ను ఏర్పాటు చేసి పశ్చిమ నియోజకర్గంలో ట్రస్టు తరఫున కార్యకలాపాలను ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. వెలంపల్లికి పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి పట్టు లేదని, అలాంటి వ్యక్తికి టికెట్‌ ఎలా ఇస్తారని రాధా వర్గం ప్రచారం చేస్తోంది. ఇటీవల జగన్‌ పాదయాత్రకు జన సమీకరణలో కూడా వెలంపల్లి విఫలయ్యారని వైరి వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. కోరాడతో పాటు పోతిన వరప్రసాద్‌ అనే రియల్టర్‌ను రాధా వర్గం తెరపైకి తెస్తోందన్న ప్రచారం జరుగుతోంది.

పశ్చిమ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో అప్రమత్తమైన వెలంపల్లి ఈ విషయాలను వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైసీపీ జిల్లా పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యం చేసుకుని కోరాడ ట్రస్టుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ ట్రస్టు కార్యక్రమాల్లో పార్టీ నాయకులు ఎవ్వరూ పాల్గొనవద్దని ప్రకటన విడుదల చేశారు. అయితే వైసీపీ పెద్దల ప్రకటనను బేఖాతర్‌ చేస్తూ మేడే రోజున కోరాడ ట్రస్టు ప్రారంభించిన ఉచిత మజ్జిగ కేంద్రాల ప్రారంభోత్సవంలో రాధా పాల్గొన్నారు. దీంతో పార్టీ పెద్దలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది.

Related Posts