ప్రజా సంక్షేమమే ఆరోగ్య రక్షా సమితి లక్ష్యం
సమితి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి వి సుబ్రహ్మణ్యం
నెల్లూరు
ప్రజా సంక్షేమమే ఉత్తమ లక్ష్యం గా ఆరోగ్య రక్షా సమితి ఏర్పాటు చేయబడింది అని ఆ సంస్థ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ నందు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ వైపరీత్యాల ఈ నేపథ్యంలో కంటికి కనిపించని కరోనా వైరస్ ను నియంత్రించడం, వ్యాధి సోకిన వారికి వైద్య సేవలు అందించడం, కరోనా వైరస్ బాధిత కుటుంబాలలో మనోధైర్యం నింపడం కోసం అనేక స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆరోగ్య రక్షా సమితి సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం యొక్క సూచనలు సలహాల మేరకు కోవిద్ 19 నియంత్రణ కోసం పనిచేస్తున్న వివిధ సంస్థలు, వ్యక్తుల తో కలిసి పని చేసేందుకు ఆరోగ్య రక్షా సమితి సిద్ధంగా ఉందన్నారు. కరోనా వైరస్ మొదటి దశ కంటే రెండవ దశ లో అనేకమంది ఆప్తులను, బంధువులను, మిత్రులను కోల్పోవడం జరిగిందన్నారు. ప్రస్తుత 3వ దశలో పిల్లలు అధికశాతం కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే అన్నారు. ఈ క్రమంలో మన ఆరోగ్యం, సామాజిక బాధ్యత అనే విధానంతో ఆరోగ్య రక్షా సమితి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి 10మందితో కూడిన ఆరోగ్య రక్షా సమితి ఐక్యత యూనిటీ లను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఏర్పాటు చేయనున్న ఆరోగ్య రక్షా సమితిలో తల్లులను, గ్రామ పెద్దలను, ఆశా వర్కర్ లను, సామాజిక సేవా సంస్థలను, వైద్యులను భాగస్వాములు చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. పాఠశాలలకు వెళ్ళే విద్యార్థినీ ,విద్యార్థులు, తల్లులు, వయోవృద్ధులు లక్ష్యంగా చేసుకుని వారందరికీ వ్యక్తిగత గృహ పరిశుభ్రతలు మరియు వ్యాక్సిన్ ప్రాధాన్యత గురించి గ్రామాల వారీగా అవగాహన కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా వ్యక్తిగత జాగ్రత్తలు లో భాగంగా మాస్కులు ధరించి విధానం, పోషకాహారం, వ్యాయామం, రోగనిరోధక శక్తిని పెంచే మందులు, ఔషధాలు, కషాయాలను తయారు చేయు పద్ధతి గురించి ప్రజలకు తెలియజేయడం తదితర కరోనా వైరస్ నియంత్రణ అవగాహన కార్యక్రమాలు ఆరోగ్య రక్షా సమితి చేపట్టేందుకు తగిన ప్రణాళిక నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు, మరియు సేవా దృక్పథం కలిగిన వ్యక్తులను ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో సమితి జిల్లా కన్వీనర్ ముక్కాల వ్యాస్ ప్రసాద్, కో కన్వీనర్ బొందల మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.