ప్రజల భాగస్వామ్యం తోనే సీజనల్ వ్యాధుల నియంత్రణ
రాష్ట్ర వైద్య సెక్రటరీ ఎస్.ఏ.ఎం రిజ్వి
హైదరాబాద్, ఆగస్టు 18
ప్రజల భాగస్వామ్యం తోనే సీజనల్ వ్యాధులను నియంత్రించ గలుగుతామని రాష్ట్ర వైద్య సెక్రటరీ ఎస్.ఏ.ఎం. రిజ్వీ అన్నారు. బుధవారం సీజనల్ వ్యాధుల నియంత్రణ పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర వైద్య సెక్రటరీ టెలీ కాన్పరెన్సు నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రణాళికాబద్దంగా పనిచేయాలని ఆయన సూచించారు. జిల్లాలోని ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించే విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.అధికంగా వ్యాధులు నమోదవుతున్న జిల్లాలో అవసరమైన చర్యలు తీసుకోవాలని, అధికంగా వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా పారిశుద్ద చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్లకు ఆయన సూచించారు.సీజనల్ వ్యాధులను నివారించడానికి ప్రజలు తమ వంతు సహకరం అందించాలని, అధికారుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి, వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. ప్రజలంతా తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, తమ నివాసాలలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మురికి కాలువలు మరియు ఓపెన్ ప్లాట్స్ లో ఉన్న పిచ్చి మొక్కలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా చికెన్ గున్యా ,డెంగ్యూ, మలేరియా మొదలగు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలని, కరోన వ్యాధితో చాలా ఇబ్బంది పడుతున్నారని అలాంటి వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరు తమ ఇంట్లో మరియు ఇంటి చుట్టుపక్కల చెత్తాచెదారం లేకుండా జాగ్రత్త పడాలని అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం వైద్య శాఖ మరియు స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజలు స్థానిక సంస్థలకు సహకరించేలా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని , ఇంటి వద్ద చెత్తను తడి చెత్త పొడి చెత్త వేర్వేరు చేసి అందించాలని కోరారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం అధికారులు తరచుగా నివాస ప్రాంతంలో ఫాగింగ్ చేయాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించాలని, యాంటి లార్వా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశించారు. ప్రజలు తమ నివాసాలో ఉండే పాతకూలర్లు, నీటి ట్యాంకర్లను తరచు శుభ్రం చేసుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు . జిల్లాలో వైద్య శాఖ బృందాలను ఏర్పాటు చేసి ఫీవర్ సర్వే చేయాలని, అనుమానంగా ఉన్న వారిని గుర్తించి, వారి లక్షణాల ప్రకారం డెంగ్యూ పరీక్ష, మల్లెరియా పరీక్ష లేదా కోవిడ్ పరీక్ష చేయాలని ఆయన సూచించారు.