డ్రైఫ్లవర్ టెక్నాలజితో అకర్షణీయ ఉత్పత్తులు
- టిటిడి ఈవో
తిరుమల ఆగస్టు 18
డ్రైఫ్లవర్ టెక్నాలజి ద్వారా టిటిడి అవసరాలకు తగిన ఉత్పత్తులు తయారు చేసి ఇవ్వడానికి ముందుకు రావాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి అధికారులను కోరారు. టిటిడి పరిపాలన భవనంలోని తన ఛాంబర్‌లో బుధవారం ఈవో డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ జానకిరామ్, పశువైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ పద్మానాభరెడ్డి, ఉద్యాన విశ్వవిద్యాలయం డైరెక్టర్ అఫ్ ఎక్స్‌టెన్షన్ డాక్టర్ శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ డ్రైఫ్లవర్ టెక్నాలజి ద్వారా బొకేలు, ల్యామినేటెడ్ ఫోటోలు, పేపర్ వెయిట్స్ తదితర ఉత్పత్తుల తయారీలో నైపుణ్యం ఉన్నడాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ముందుకు వస్తే తిరుపతిలో స్థలం కేటాయిస్తామని చెప్పారు. ఇందులో ఉత్పత్తులకు అవసరమయ్యే యంత్రాలు, సౌకర్యాలతో పాటు, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసుకోవచ్చునని సూచించారు. ఐదు సంవత్సరాల వరకు ఈ కేంద్రాన్ని నిర్వహించుకుని తరువాత టిటిడికి అప్పగించే ప్రతిపాదన పరిశీలించాలన్నారు.
డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయం డ్రైఫ్లవర్ టెక్నాలజి ద్వారా ఇప్పటికే రోజ్‌టీ, లిల్లీ టీ, లెమన్ గ్రాస్ మ్యారిగోల్డ్ టీ, హైబిస్కస్ టీ, సోపులు, బాడీ కెర్ ఉత్పత్తులు, ఫేషియల్ క్రీములు, మాస్క్‌లు, స్ప్రే లాంటి అనేక ఉత్పత్తులు స్థానికంగానే తయారు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు.