ప్రకృతి విపత్తులను గుర్తించేందుకు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలకూ 12 సెన్సర్లను ఉపయోగిస్తున్నారు.పిడుగులు పడే ప్రాంతాలు, భారీ వర్ష సూచనను ముందుగా పసి గట్టేందుకు ఎలక్ట్రో మాగ్నిటిక్ ఫీల్డ్ లను వినియోగిస్తున్నారు.శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, గుంటూరు, నెల్లూరు. అనంతపురం, కర్నూలు, కడప, కుప్పం సహా చెన్న్తె, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో సెన్సర్ల ద్వారా విపత్తులను గుర్తిస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్ధ అధికారులు పేర్కొన్నారు. విపత్తుల నివారణ సంస్ధ కార్యాలయం రేయింబవళ్లు పనిచేస్తుంది. పిడుగుపడి మృతి చెందినవారిలో అత్యధికంగా పొలాల్లో, ఆరుబయట ఉన్న వారు ఉన్నట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. గతేడాది మే నుంచి దాదాపు కాలంలో 45 మంది పిడుగుపాట్లకు మత్యువాత పడగా, వారిలో శబ్ద తీవ్రతకు అయిదుగురు, చెట్ల కింద నిలబడి ఉండగా మృతి చెందినవారు ఏడుగురు, పొలాలు, ఆరు బయట ప్రాంతాల్లో ఉన్న సమయాల్లో మృతి చెందిన వారు 33 మంది ఉన్నారు. మేఘాలు కమ్ముకోవడం, ఉరుములు పిడుగులు పడే ముందు వెలువడే సంకేతాలుగా గుర్తించి ఆ సమయంలో ఆరుబయట ఉండరాదని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్ధ అధికారులు హెచ్చరిస్తున్నారు.పిడుగు తీవ్రతను కూడా అంచనా వేయగల్గుతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో 40 నిమిషాల ముందుగా ఏయే ప్రాంతాల్లో నష్టం సంభవించనుందో గుర్తించగల్గుతారు. ఇందుకు ఒక్కో సెన్సరు వెయ్యి కిలోమీటర్ల పరిధిలో విపత్తులను ముందస్తుగా గుర్తిస్తాయి. అత్యవసర సమాచారాన్ని ప్రజలు తెలిపేందుకు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం (ఎస్‌ఇఒసి)లో టోల్ ఫ్రీ నెంబరు 1800 425 0101 నెంబరును ఏర్పాటు చేశారు. ఇతర సమాచారానికి, అధికారులతో మాట్లాడాలనుకుంటే 08645 246600 నెంబరును అందుబాటులో ఉంచారు.