2027లో భారత తొలి మహిళా సీజేఐగా బీవీ నాగరత్న కు అవకాశం
న్యూఢిల్లీ ఆగష్టు 18
భారత అత్యున్నత న్యాయస్థానానికి మహిళా చీఫ్ జస్టిస్ కావాలన్న డిమాండ్లు ఇటీవల వెల్లువెత్తాయి. ఈ నేపద్యం లో సీజే ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం 9 మంది జడ్జిలను అత్యున్నత న్యాయస్థానానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం కర్నాటక హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ బీవీ నాగరత్న.. కొలీజియం ప్రతిపాదించిన జడ్జిల్లో ఒకరిగా ఉన్నారు. మహిళా జస్టిస్ బీవీ నాగరత్న 2027లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇండియా తొలి మహిళా సీజేఐగా ఆమె చరిత్ర సృష్టించే ఛాన్సు ఉంది. నాగరత్నతో పాటు మహిళా జడ్జిల్లో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా త్రివేదిలు ఉన్నారు.మాజీ సీజేఐ ఎస్ఏ బో్డే తన రిటైర్మెంట్‌కు ముందు ఈ అభిప్రాయాన్ని ఆయన వినిపించారు. భారత్‌కు ఓ మహిళ చీఫ్ జస్టిస్ అయ్యే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. మహిళ న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ చేయాలన్న ఆలోచన తమలో ఉందని, ఆ దిశగా తాము చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఓ సందర్భంలో తెలిపారు.కర్నాటక హైకోర్టులో 2008లో జస్టిస్ నాగరత్న అదనపు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు పర్మినెంట్ జడ్జిగా మారారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులగా పదోన్నతి పొందినవారిలో మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నర్సింహా ఉన్నారు. కొలీజియం ప్రతిపాదించిన జాబితాలో జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లు ఉన్నారు.