లక్నో, ఆగస్టు 19,
రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఏడేళ్ల నుంచి వరసగా అన్ని రాష్ట్రాలపై దండయాత్ర చేస్తున్న మోదీ సేనకు రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకం. త్వరలో జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు బీజేపీనే కాదు కొన్ని ప్రాంతీయ పార్టీలకు వరంగా మారనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ జాతకం కూడా మారుతుందన్న లెక్కలు విన్పిస్తున్నాయి. అందుకే ఇప్పుడు జగన్ యూపీ ఎన్నికల ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు. అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో మెజారిటీని బట్టే రాష్ట్ర పతి ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయి. 403 స్థానాలున్న యూపీలో 306 స్థానాలు బీజేపీకి గత ఎన్నికల్లో దక్కాయి. ఈసారి అన్ని స్థానాలు ఖచ్చితంగా రావనేది విశ్లేషకుల అంచనా. యోగి ఆదిత్యానాధ్ పాలనపై వ్యతిరేకత రావడం, దేశమంతటా మోడీ ప్రభంజనం తగ్గడం, రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకతంగా చట్టాలు తేవడం వంటివి బీజేపీకి ఇబ్బంది కల్గించనున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రపతి ఎన్నికలపై కూడా పడనున్నాయి. అందుకే జగన్ వంటి నమ్మకమైన మిత్రులను బీజేపీ దూరం చేసుకుంటే బీజేపీకి సినిమా రాష్ట్రపతి ఎన్నికల నుంచే మొదలవుతుంది. అందుకే జగన్ సయితం యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని తక్కువ స్థానాలు వస్తే జగన్ కు కేంద్ర ప్రభుత్వం వద్ద అంత డిమాండ్ పెరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో జగన్ తప్ప మరొకరు బీజేపీతో కలసి వచ్చే అవకాశాలు లేవు. జగన్ రాష్ట్ర పతి ఎన్నికల్లో ఓట్ల పరంగా కూడా బలంగా ఉన్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత జగన్ జాతకం మారిపోతుందన్న కామెంట్స్ సర్వత్రా విన్పిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి అక్కడ అఖిలేష్ యాదవ్ తిరిగి పుంజుకుంటున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. అదే జరిగితే బీజేపీ యూపీలో అధికారానికి దూరమవ్వక తప్పదు. అప్పుడు అన్ని అంశాల్లో జగన్ సహకారం కమలం పార్టీకి అవసరం. అందుకే జగన్ ఆయన పార్టీ నేతలు యూపీ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.