హైదరాబాద్, ఆగస్టు 19,
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు మూడు బిగ్ టాస్క్ లు ఉన్నాయి. వీటిని అధిగమించి పార్టీని ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. పీసీసీ బాధ్యతలను చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచిన మాట వాస్తవమే. అయితే మాస్ లీడర్ గా జనంలోకి పార్టీని మరింతగా తీసుకెళ్లాలనుకుంటున్న రేవంత్ రెడ్డికి మూడు టాస్క్ లు ప్రధానంగా కనపడుతున్నాయి. వీటిని అధిగమిస్తేనే కాంగ్రెస్ ను రాష్ట్రంలో రేవంత్ రెడ్డి విజయతీరాలకు చేర్చగలరు.బలమైన టీఆర్ఎస్ ను ఢీకొనాలంటే ఆర్థికంగా, సామాజికంగా మద్దతు అవసరం అవుతుంది. కాంగ్రెస్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో డీలా పడిపోయి ఉంది. వరస ఓటములతో అనేక మంది నేతలు, కార్యకర్తలు కూడా పార్టీని వదిలి వెళ్లారు. టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం తామేనని రేవంత్ రెడ్డి నిరూపించగలగాలి. అయితే అది ఎన్నికల ద్వారానే సాధ్యం. హుజూరాబాద్ లో గెలుపు అంత సులువు కాదు. దీంతో టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి మరింత శ్రమించాల్సి ఉంటుంది.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకుని తిరుగుతుంది. బీజేపీని నిలువరించేందుకు రేవంత్ రెడ్డి తొలుత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి రప్పించుకోవడంతో పాటు ఉన్న నేతలు వెళ్లకుండా చూసుకోగలగాలి. బీజేపీ మరింత ఎదగనివ్వకుండా చేయగలిగితేనే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా సక్సెస్ అయినట్లు.ఇక మూడోది ముఖ్యమైన విషయం. ఇది పార్టీలో కోవర్టులు. రేవంత్ రెడ్డి నియామకం అంటే ఇష్టపడని నేతలు అనేక మంది ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. వారు వీలయినప్పుడల్లా రేవంత్ రెడ్డిని వెనక్కు లాగేందుకే చూస్తారు. తొలుత దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. కోవర్టులను వదిలేది లేదు, నమ్మకమైన నేతలను వదులుకునేది లేదని చెప్పారు. తొలుత పార్టీలో ప్రక్షాళన జరగాల్సి ఉంది. అప్పుడే రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించగలుగుతారు. ఈ మూడింటిలో ఏది విఫలమయినా అధికారం అందే అవకాశమే ఉండదు.