ఎమ్మెల్సీగా గాలి సరస్వతి ఏకగ్రీవ ఎన్నిక ఇక లాంఛనమే. బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి మస్తాన్‌రెడ్డి పోటీనుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడమేకాక.. ఎన్నికల అధికారి సమక్షంలో తన నామినేషన్ ఉపసంహరిం చుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సరస్వతి ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి సరస్వతి, స్వతంత్ర అభ్యర్ధి ఎం.మస్తాన్‌రెడ్డి నామినేషన్లను ఆమోదిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపున.. సాయంత్రం స్వత్రంత అభ్యర్ధి ఎం.మస్తాన్‌రెడ్డి తన నామినేషను ఉపసంహరించుకున్నారు. దీంతో గాలి సరస్వతి ఎన్నిక లాంఛనంగా మారింది. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణనాయుడు మృతితో జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానం ఖాళీ అయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గతనెల 26న ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత నేత గాలి ముద్దు కృష్ణమనాయుడి సతీమణి గాలి సరస్వతిని పార్టీ ఖరారు చేసింది. ఈ నెల 3న ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఆపై ఎట్టకేలకు స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్‌ను శుక్రవారం సాయంత్రం ఉపసంహరించుకోవడంతో సరస్వతి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మే 7వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు ఉండటంతో.. ఆ తరవాత ఏకగ్రీవ ఎన్నికను అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌తో బాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులను ఆర్వో పరిగణనలోకి తీసుకోలేదు. అఫిడవిట్‌లోని అంశాలపై తుది నిర్ణయం ఆర్వో పరిధిలో లేదని స్పష్టం చేసి తుదిగా స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఆమోదించారు. సాయంత్రం జిల్లా సచివాలయానికి వచ్చిన మస్తాన్‌రెడ్డి ఆర్వోకు తన ఉపసంహరణ పత్రాన్ని అందజేశారు. తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఎమ్మెల్సీ ఉపఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. పలుమార్లు చర్చల అనంతరం ఎట్టకేలకు ఆయా నేతల ప్రయత్నాలు ఫలించి స్వతంత్ర అభ్యర్థి పోటీనుంచి వైదొలిగారు. దీంతో టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.