స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.
ఎందుకు ఈ వ్రతం
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.
వ్రత విధి విధానం
తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.
తోరగ్రంథి పూజ
తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలెను.
ఓం కమలాయై నమ ప్రథమ గ్రంథిం పూజయామి.
ఓం రమాయై నమ ద్వితియ గ్రంథిం పూజయామి.
ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి.
ఈ వ్రత విధానం వెనుక భక్తి తత్పరులతోపాటు కళాత్మక దృష్టీ ఉండటం విశేషం. ఈ వ్రత విధానాన్ని గురించి భవిష్యోత్తర పురాణం వివరిస్తోంది. సకల సంపదలు కలిగించే ఉత్తమ వ్రతంగా ఈ వ్రతానికి పేరుంది. వరాలనిచ్చే లక్ష్మి కనుక వరలక్ష్మి అయింది. ఆమె స్త్రీలకు సర్వ సౌభాగ్యాలనూ కలిగిస్తుంది. ఈ వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే స్త్రీలకు ఐదోతనం, సౌభాగ్యం, సంతానప్రాప్తి కలుగుతాయని నమ్మకం. ముత్త్తెదువులు, కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని అభ్యంగ స్నానాదులు ముగించుకోవాలి. తర్వాత నూతన వస్త్రాల్ని ధరించి పూజ కోసం నిర్ణయించిన స్థలాన్ని ఆవుపేడతో అలికి, పద్మం ముగ్గుతో తీర్చిదిద్దుతారు. దానిపై ఒక పీట అమర్చి పీట మీద బియ్యం పోసి దాని మీద కలశాన్ని ఉంచుతారు. ఆ కలశం మీద అలంకరించాల్సిన కొబ్బరికాయకు కళాత్మక రీతిలో పసుపు, కుంకుమ, కాటుకలతో కళ్ళు, ముక్కు, చెవులను తీర్చిదిద్దుతారు. అలా అందంగా కళకళలాడుతూ ఉండే వరలక్ష్మీ అమ్మవారి శోభాయమానమైన ముఖాన్ని సిద్ధం చేస్తారు. శక్తి కొద్దీ అమ్మవారి ముఖానికి పసుపు ముద్దలతో అమర్చిన ముక్కు, చెవులకు బంగారు ముక్కుపుడక, దిద్దులు లాంటివి అమర్చుతారు. కలశం మీద పెట్టాక చక్కగా చీరను అలంకరించి హారాల్నీ వేస్తారు. చూసే వారికి వరలక్ష్మీదేవి ఆ ఇంటికి వచ్చి కూర్చుందా అన్నట్టుగా కనిపిస్తుంది. కొంత మంది ఇవేవీ లేకుండా కేవలం కలశం పెట్టికానీ, అమ్మవారి ప్రతిమలు పెట్టికానీ పూజ చేస్తారు. సాయం సమయంలో ఇరుగు పొరుగు ఉన్న ముత్త్తెదువులు అందరినీ పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపురాసి, నుదుట కుంకుమ పెట్టి, మెడకు గంధాన్ని అద్ది గౌరవిస్తారు. ముత్త్తెదువులందరితో కలసి వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని తెలిపే కథను శ్రవణం చేస్తారు. పూర్వం మగధ దేశంలో కుండినం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఓ ఉత్తమ స్త్రీ తన భర్తనూ, అత్తమామలనూ భక్తితో సేవించుకుంటూ వారికి తన ప్రేమానురాగాలను పంచుతూ వారి ప్రశంసలు, ఆశీస్సులను అందుకొంటూ ఉండేది.
సన్మార్గవర్తనులైన స్త్రీలకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందన్న సత్యాన్ని ఆమె ద్వారా వరలక్ష్మీదేవి నిరూపించాలనుకుందట. ఓ రోజు చారుమతి కలలోకి వరలక్ష్మీదేవి వచ్చి తాను వరలక్ష్మీ దేవిని, శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తనను పూజించమనీ, కోరిన వరాలను ఇస్తాననీ చెప్పింది. కలలోనే చారుమతి వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి అర్చించుకుంది. ఆ తర్వాత మెళకువ రాగానే జరిగిన విషయమంతా తన ఇంటి వారికి చెప్పింది. అంతా ఎంతో ఆనందంగా శ్రావణమాసపు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. ఆ రోజు రాగానే చారుమతి ఇరుగుపొరుగు ముత్త్తెదువులందరినీ కలుపుకొని తన ఇంటిలో శాస్త్రవిధిగా, స్వప్నంలో లక్ష్మీదేవి చెప్పిన తీరులో వరలక్ష్మీ అమ్మవారిని ఏర్పాటు చేసి పూజలను నిర్వహించింది. అనంతరం చారుమతి, అక్కడ ఉన్న ముత్త్తెదువులంతా వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణలు చేయటం ప్రారంభించారు. ఒక్కొక్క ప్రదక్షిణం చేస్తుంటే కొన్నికొన్ని దివ్యమైన ఆభరణాలు వారికి తెలియకుండానే వారి శరీరాలకు వచ్చి చేరాయి. ఆ స్త్రీల గృహాలన్నీ ఐశ్వర్యాలతో నిండిపోయాయి. అలా వరలక్ష్మీదేవి కటాక్షం ఆ స్త్రీలందరికీ ప్రాప్తించింది. సంప్రదాయకంగా తరతరాల నుంచి వస్తున్న ఈ వ్రతం పైకి మామూలు పురాణ కథలానే కనిపించినా ఇందులో ఒక సామాజిక చైతన్య సూత్రం ఇమిడి ఉంది. చారుమతికి వరలక్ష్మీదేవి కలలో కనిపించి తనను పూజించమని, సకల ఐశ్వర్యాలనూ ఇస్తానని చెప్పింది. చారుమతి ఆ వ్రతాన్ని స్వార్థబుద్ధితో తానొక్కతే చెయ్యలేదు. తనతోపాటు తన వారు, తన చుట్టుపక్కల ఉన్న కుటుంబాల స్త్రీలంతా వరలక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు కావాలని అందరినీ కలుపుకొని వ్రతం చేసింది. స్త్రీలు ఇలా అందరినీ కలుపుకొని సామరస్య ధోరణిలో, నిస్వార్థ బుద్ధితో మెలగాలనే ఓ సామాజిక సందేశం ఈ వ్రత కథ వెనుక ఉంది.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో