నల్గొండ, ఆగస్టు 20,
పీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు రేవంత్. ఈ సమయంలో ఆయనకు అసమ్మతి దెబ్బలు గట్టిగానే తగుతున్నాయట. సీనియర్ల సహాయ నిరాకరణతో సభా వేదికలను మార్చుకోక తప్పడం లేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఇదే హాట్ టాపిక్. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్కఅన్నట్టుగా వెళ్తున్నారు పీసీసీ చీఫ్. ఈ క్రమంలోనే పార్టీలో సభలు.. సమావేశాల ప్రకటనలపై వివాదాలు రేగుతున్నాయి. తమకు చెప్పకుండా సభలు పెట్టడం ఏంటని కొందరు నేతలు అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. ఇబ్రహీంపట్నం గొడవ అదే. ఇంద్రవెల్లి తర్వాత అక్కడ సభ పెట్టాలని అనుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్రుగా ఉండటంతో సభాస్థలిని భువనగిరి నుంచి.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి మార్చుకోక తప్పలేదు. ఇబ్రహీంపట్నం నుంచి రావిర్యాలకు వేదిక మారిపోయింది. దీంతో రేవంత్‌కు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోందని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పడటం లేదు. ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. ఇలాంటి సమయంలో ఇబ్రహీంపట్నంలో దళిత గిరిజన దండోరా సభ పెట్టాలంటే.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడాలి. ఇబ్రహీంపట్నం ఆ లోక్‌సభ పరిధిలో ఉండటమే దీనికి కారణం. ఇద్దరు నాయకులు మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఓ మెట్టు దిగడానికి వారు ఇష్టపడటం లేదట. దీంతో చేసేది లేక.. రేవంత్ మనసు మార్చేసుకున్నారు. అసమ్మతి దెబ్బకు రావిర్యాలను ఎంపిక చేసుకుంది పీసీసీ చీఫ్ అండ్ కో.నల్గొండ లోక్‌సభ పరిధిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. నల్గొండలో సభ పెట్టాలంటే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం అవసరం. ప్రస్తుతం అక్కడ ఎంపీగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉన్నారు. ఉత్తమ్ కూడా రేవంత్‌కి సహకరించేది డౌటే. ఉపఎన్నిక జరిగే హుజూరాబాద్ కంటే ముందు.. నల్గొండ పార్లమెంట్ పరిధిలో సభ ఏర్పాటు చేయాలన్నది రేవంత్ ఆలోచన అట. సీనియర్ నేత జానారెడ్డి ఈ పార్లమెంట్ పరిధిలో ఉండటంతో కలిసి వస్తుందని లెక్కలు వేసుకున్నారట. జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి సారథ్యంలో మిర్యాలగూడలో సభకు కూడా ప్లాన్ చేశారట. ఇంతలో ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి నుంచి నెగిటివ్ కామెంట్ వచ్చినట్టు టాక్. దీంతో అక్కడ సైతం ఇప్పట్లో సభ కష్టమేనని అనుకుంటున్నారట.తెలంగాణలో కాంగ్రెస్‌కు ఉన్నదే ముగ్గురు ఎంపీలు. వారిలో ఒకరు పీసీసీ చీఫ్. ఇంకొకరు పీసీసీ మాజీ చీఫ్. మరొకరు సీనియర్ నాయకుడు. ఇలా ఇద్దరు ఎంపీల నుంచి పార్టీ సారథికి ఓ రేంజ్‌లో అసమ్మతి సెగ తగులుతుండటంతో పార్టీలో చర్చగా మారుతోంది. వీళ్ల మధ్య మాటలు కలవడం లేదు.. మనసులూ కలవడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలిసినా హైకమాండ్ పెద్దలు, ఇంఛార్జ్ ఏం చేయలేని దుస్థితి. దీంతో ఈ ఇద్దరు ఎంపీల దెబ్బకు రేవంత్ మనసు మార్చుకోక తప్పడం లేదు. సెగలు రేపుతున్న సభల ఎపిసోడ్ పీసీసీ చీఫ్‌కు ఇంకెలాంటి కష్టాలు తెచ్చిపెడతాయో చూడాలి.