హైదరాబాద్, ఆగస్టు 20,
రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా విషయాల్లో ఒక్కటే విధంగా పాలన సాగుతోంది. ఏపీలో చూసుకుంటే సంక్షేమ పధకాలు లెక్కలు మిక్కిలిగా అమలు చేస్తున్నారు. జనాలకు వాటిని పంచుతున్నారు. ఇందుకోసం లక్ష కోట్లకు పైన ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు పెట్టింది. మరో వైపు తెలంగాణాలోనూ సంక్షేమానికి కేసీఆర్ తెర తీశారు. ఇంతకు ముందు కళ్యాణ లక్ష్మి పధకం కానీ రైతు బంధు వంటి స్కీములు కానీ పెద్దగా ఫోకస్ అవలేదనో ఏమో కానీ దళిత బంధు పేరిట కేసీఆర్ కొత్త స్కీమ్ తెచ్చారు. ఇది భారీ స్కీమ్. ఒక విధంగా దేశంలోని మొత్తం సంక్షేమ పధకాలకు అది బాహుబలి లాంటిదే అని చెప్పుకోవాలి.ప్రతీ దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం అంటే నిజంగా గ్రేటే. దాని కోసం బడ్జెట్ లో ఏకంగా నలభై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని కూడా కేసీఆర్ చెబుతున్నారు. అంటే మొత్తం ఆ రాష్ట్ర బడ్జెట్ లో అయిదవ వంతు అన్న మాట. ప్రతీ వంద రూపాయలలో ఇరవై రూపాయలు ఈ పధకం కోసమే అన్న మాట. ఇక దీని అమలు అన్నది కూడా చాలా భారంగా ఉండబోతోంది అన్నది కూడా ఆర్థిక వేత్తల అభిప్రాయం.మరో వైపు దళితుల కోసం ఇప్పటివరకూ దేశ చరిత్రలో లేని విధంగా దళిత బంధు పధకం తెచ్చిన కేసీఆర్ ని డైరెక్ట్ గా ఏమీ అనలేని నిస్సహాయత అక్కడి విపక్షాలది. అదే సమయంలో ఇది పక్కా ఓట్ల రాజకీయం అని తెలుసు. దాంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా తెలంగాణా ప్రతిపక్షాల పరిస్థితి ఉంది. పధకం మంచిదే కానీ అంటూ అలా మాటలను మింగేస్తూ కాంగ్రెస్, బీజేపీ సహా విపక్ష నేతలు మాట్లాడుతున్నారు. ఇదే పరిస్థితి ఏపీలో కూడా ఉంది. జగన్ తెచ్చిన అనేక సంక్షేమ పధకాల మీద తెలుగుదేశం బీజేపీ సహా ఎవరూ గట్టిగా వద్దు అని చెప్పలేరు. అలా అని చెప్పి లబిదారులకు చెడ్డ కాలేరు. పోనీ అని ఊరుకుంటే వైసీపీ రాజకీయంగా బలపడుతోంది అన్న బెంగ. మొత్తానికి జగన్ కి దేశాన ఎక్కడా పైసా అప్పు పుట్టకుండా ఏపీ విపక్షాలు కొత్త వ్యూహాలకు తెర తీస్తున్నాయి. ఏపీలో లోటు బడ్జెట్ కాబట్టి అలా చేస్తున్నారు. తెలంగాణాలో మిగులు బడ్జెట్ కదా. పైగా ధనిక రాష్ట్రం. కేసీఆర్ అపర చాణక్యుడు. ఆయన చేస్తాను అంటే చేసేస్తారు. దాంతో ఏమి చేయాలో తెలియక అక్కడి విపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. చూడాలి మరి ఈ సంక్షేమం హద్దులు దాటే కొద్దీ విపక్షాలలో అసహనం కట్టలు తెంచుకుంటోంది.