మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది కూలీలు దుర్మరణం
ముంబై ఆగష్టు 20
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి 13 మంది కూలీలు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బుల్ధానా జిల్లా సింధ్‌ఖేద్‌రాజా-మెహకర్ రహదారిపై దూసర్‌బిడ్ గ్రామ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. నాగ్‌పూర్-ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు పనులకు ఐరన్ తరలిస్తున్న లారీలో కూలీలు ప్రయాణిస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో లారీలో 16 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.వేగంగా వెళ్తున్న లారీ రహదారిపై ఏర్పడి భారీ గుంతలోకి దూసుకెళ్లడంతో అదుపుతప్పి బోల్తాపడినట్లు బుల్ధానా ఎస్పీ అరవింద్ చౌరియా తెలిపారు. సమాచారం అందుకున్న కింగాన్ రాజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని జల్నా జిల్లా సింధ్‌ఖేద్‌రాజా దవాఖానకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. మృతులు ,క్షతగాత్రులంతా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలని ఆయన పేర్కొన్నారు.