భక్తులతో వేములవాడ రాజన్న ఆలయం కిటకిట
వేములవాడ ఆగష్టు 20
శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు వేకువజామునుంచే పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించారు. కల్యాణకట్టలో తమ పిల్లలకు ఎంతో భక్తిశ్రద్దలతో తలనీలాలను సమర్పించారు. రాజన్నకు ప్రీతిమొక్కైన కోడెమొక్కు తీర్చుకున్నారు. ధర్మ దర్శనం శీఘ్రధర్మనం, ప్రత్యేక దర్శనం కోసం క్యూలైన్ల మీదుగా ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు భక్తులు గర్భగుడిలో నిర్వహించుకునే అభిషేక పూజలు, అన్న పూజలు, ఆకుల పూజలను రద్దు చేశారు. దీంతో 200 రూపాయల అభిషేకం టిక్కెట్లు తీసుకున్న భక్తులకు సోమేశ్వరాలయంలో అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నను సుమారు రూ.18 లక్షల ఆదాయం సమకూరిందని, దాదాపు 30 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.