విశాఖపట్టణం, ఆగస్టు 21,
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గురించి అందరికీ తెలుసు. ఆయన రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఉమ్మడి ఏపీలో ప్రముఖుడిగా నిలిచారు. గంటా మాస్టర్ ప్లాన్స్ కూడా ప్రత్యర్ధులను చిత్తు చేసేలా ఉంటాయి. తాను సైలెంట్ గా ఉన్నారు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఆయన చాణక్య రాజకీయం ముందు అవతల వారు ఎపుడూ వణకాల్సిందే అన్న దాంట్లో సందేహం అక్కర్లేదు. మరి అటువంటి గంటా శ్రీనివాసరావు ఇపుడు ఏం చేస్తున్నారు అన్నదే అందరి ఆలోచన. గంటా అయితే అసలు గుమ్మం దాటి బయటకు రావడంలేదు అలాగని ఆయన ఇక ఎప్పటికీ మాజీనే అనుకుంటే పొరపాటే అంటున్నారు. గంటా గురించి జరుగుతున్న ప్రచారం కనుక నిజమైతే మాత్రం ఆయన 2024 ఎన్నికల్లో కీలకమైన పాత్రనే ఏపీ రాజకీయాల్లో పోషించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.గంటా శ్రీనివాసరావుకు ఏపీలో అన్ని రాకీయ పార్టీల అధినేతలతో డైరెక్ట్ గానే పరిచయాలు ఉన్నాయి. ఈ రోజుకీ ఆయన కోరి వస్తాను అంటే కాదనే పరిస్థితి ఉండదు. అయితే గంటా శ్రీనివాసరావు అలా ఇలా ఆలోచించి ఏదో ఒక పార్టీలో చేరిపోయే రకం కాదు. ఆయన తన కెరీర్ గురించి కూడా గట్టిగానే ఆలోచిస్తారు. అదే సమయంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాజకీయ సమీకరణలు ఏవి బలంగా పనిచేస్తాయి అన్నది కూడా ఆయన కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇవ్వగలరు. ఇపుడు ఆయన అదే పనిలో ఉన్నారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టే సత్తా తెలుగుదేశానికి లేదు అని బలంగా అభిప్రాయపడుతున్నారని విశాఖ జిల్లాలో గంటా అనుచరుల నుంచి వినిపిస్తోన్న టాక్ ?చంద్రబాబు లోకేష్ కాంబో టీడీపీని ఒడ్డున పడేయదు సరికాదా మైనస్ అవుతుంది అని కూడా గంటా శ్రీనివాసరావు యోచిస్తున్నారుట. గంటా ఈక్వేషన్లు ఎప్పుడూ మిస్ కావు. ఈ నేపధ్యంలో వైసీపీకి కూడా వచ్చే ఎన్నికల నాటికి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని అంచనా కడుతున్నారు. దాంతో మూడవ ఆల్టర్నేషన్ వస్తే కనుక హిట్ అవుతుంది అన్నది గంటా శ్రీనివాసరావు ఆలోచనగా ఉందిట. అందుకే ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. అయిదారు జిల్లాలలో రాజకీయాన్ని తారు మారు చేయగల బలం కాపులకు ఉంది. కాపులు కూడా జనసేనను ఇపుడు సొంతం చేసుకుంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో జనసేన పక్షాన గంటా శ్రీనివాసరావు లీడ్ రోల్ ప్లే చేస్తారు అంటున్నారు.ఒక విధంగా ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన గంటా శ్రీనివాసరావు ఇదే మార్క్ పాలిటిక్స్ ని జనసేనలో కూడా పోషిస్తారు అంటున్నారు. నాడు గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యంలో ఉత్తరాంధ్రలో అన్ని నియోజకవర్గాల టిక్కెట్ల ఎంపికలో కీ రోల్ పోషించడంతో పాటు ఆయన సొంత జిల్లా ప్రకాశంలోనూ.. ఇటు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల టిక్కెట్ల ఎంపికలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయనకు ఉన్న అర్ధబలం, అంగబలం కనుక పవన్ కి జత కలిస్తే ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పులు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!