విజయవాడ, ఆగస్టు 21,
టీడీపీపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ఫర్వాలేదు.. కానీ, చంద్రబాబును ఏమన్నా మేం ఒప్పుకోం అనే నాయకులు ఒక్క టీడీపీలోనే కాదు.. ఇతర పార్టీల్లోనూ చాలా మంది ఉన్నారు. వీరిలో టీడీపీ నుంచి బయటకు వెళ్లినవారితో పాటు గతంలో ఆయనకు మిత్రపక్షంగా ఉన్న పార్టీల నాయకులు కూడా ఉన్నారు. దీంతో చంద్రబాబుపై విశాఖలో పోలీసులు కేసులు నమోదు చేసినప్పుడు.. అనేక మంది పార్టీలకు అతీతంగా.. జగన్‌పై విరుచుకుపడిన ఘటన గుర్తుండే ఉంటుంది. అదే సమయంలో చంద్రబాబు వ్యూహాలను సైతం వారు పరోక్షంగా సమర్ధించిన ఘటనలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉదంతంలో చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో ఆయనకు అన్ని పక్షాల నుంచి మద్దతు లభించింది. అదే సమయంలో పార్టీ కీలక నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటివారిని అరెస్టు చేసిన సందర్భంలోనూ చంద్రబాబు చేపట్టిన నిరసనలకు ప్రత్యక్షంగా కమ్యూనిస్టులు.. పరోక్షంగా జనసేన నేతలు కూడా సహకరించారు. ఇక, పార్టీలు వేరైనా.. చంద్రబాబు వర్గంగా పేరున్న.. కొందరు ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా మద్దతుగా మాట్లాడిన సందర్భాలు.. ఆయా విషయాల్లో చంద్రబాబుకు అనుకూలంగా కోర్టుల్లో వారంతట వారే కేసులు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే.. అనూహ్యంగా ఆరు మాసాల నుంచి ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ సీనియర్ల మధ్య చర్చ సాగుతోంది. ప్రస్తుతం టీడీపీ సీనియర్లు.. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను అరెస్టు చేసినప్పుడు కానీ.. ఇప్పుడు దేవినేని ఉమాను అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు కానీ.. చంద్రబాబు ఇచ్చిన పిలుపును ఏ ఒక్కరూ అందిపుచ్చుకోలేదు. ముఖ్యంగా ఆయనకు గత మిత్రుడు.. ఇప్పుడు కూడా మిత్రుడనే భావన ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ సహా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్.. ఇలా అనేక మంది ఎవరూ కూడా మాట్లాడలేదు. కనీసం.. చంద్రబాబు కు సంఘీ భావం కూడా ప్రకటించలేదు. దీంతో చంద్రబాబు ఒంటరయ్యారా ? అనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో ఆయా నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారనే వాదన కూడా తెరమీదికి వస్తోంది. ప్రధానంగా.. టీడీపీ ఇప్పటి వరకు జరిగిన స్థానిక ఎన్నికల్లో కానీ, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో కానీ.. ఆశించిన విధంగా దూకుడు చూపలేక పోయింది. జగన్ పాలన ప్రారంభమై.. రెండేళ్లు గడిచినా.. ప్రభుత్వ వ్యతిరేకతను ఆయన తనకు అనుకూలంగా మార్చుకోలేక పోయారు.ఏదో మీడియా ముందుకు వచ్చి నాలుగు మాటలు అంటున్నారే.. తప్ప.. ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నారు. దీంతో చంద్రబాబు నాయకత్వంపై వారికి నమ్మకం సన్నగిల్లి అయినా.. ఉండాలి. లేదా.. జగన్ ఇప్పట్లో మారడు కాబట్టి.. మనం జోక్యం చేసుకుని మనమీదకు తెచ్చుకోవడం.. ఎందుకు? అనైనా అనుకుని ఉండాలని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా.. కీలక నేతల మద్దతును ప్రస్తుతానికి చంద్రబాబు కోల్పోయారనే అంటు్న్నారు.