నెల్లూరు, ఆగస్టు 21,
సర్వేలు అబద్ధాలుగానూ చెప్పలేము. అవి ఆ రోజుకు ఆ నిముషానికి ఉన్న మూడ్ ని మాత్రమే ఎలివేట్ చేస్తాయి. ఒక ఆసామి పని లేక ఆకలి మీద ఉన్నాడనుకోండి. అతని దగ్గరకు వెళ్ళి ఇపుడు పాలన ఎలా ఉంది అంటే గట్టిగా కరిచేస్తాడు, అరిచేస్తాడు. ప్రపంచంలోని తిట్లు అన్నీ కలిపి కూడా లంకించుకుంటాడు. అదే బాగా బాగున్న వ్యక్తిని అడిగితే అంతా బాగుందనే అంటాడు. కానీ ఈ రెండూ తప్పు, రెండింటిలోనూ వాస్తవం లేదు. ఒక ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య అన్ని విషయాల్లో ఒక్క మాట ఉండదు. అలాంటిది ప్రతీ రోజూ చైతన్యం అవుతున్న సమాజంలో ఎన్నో భావాలు ఉంటాయి. అందరూ ఒక్కలా అనాలని కూడా లేదు. పైగా సర్వే చేసిన వారి ఉద్దేశ్యాలు ఏంటి అన్న దాని నుంచే ప్రశ్నలు వస్తాయి. అలాగే వారు ఎంచుకున్న వారిని కూడా చూడాలి. ఇక అసంతృప్తి అన్నది ప్రమాదం కాదు, ప్రమాద సంకేతం మాత్రమే. అలా ఆలోచించినపుడు ఒక సర్వేలో కొంత వ్యతిరేకత కనిపించింది అంటే జస్ట్ చెక్ చేసుకుని ముందుకు సాగాలి తప్ప పడి ఏడవడం మంచిది కాదు. అలాగే ఆ సర్వేను నమ్మేసి అవతల పక్షం కూడా ఊహల ఉయ్యాలలో ఊగేసి కాడె వదిలేసినా అంతకంటే పెద్ద తప్పు ఉండదు. జగన్ వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు. ఆయనే ఏపీకి శాశ్వత సీఎం అని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంటున్నారు. సర్వేలు అన్నీ తప్పు అనేస్తున్నారు. అవి చేయించిన వారు ఎవరో తెలుసు అని కూడా చెబుతున్నారు. మరి ఇదే సర్వే గత ఏడాది జగన్ కి నాలుగవ ర్యాంక్ ఇచ్చినపుడు ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి వారు బాగు బాగు అని తెగ మెచ్చారు కదా. ఇపుడు ఈ గింజుకోవడం ఎందుకు అన్నదే ప్రశ్న. అయితే ఇక్కడ సర్వే కంటే కూడా టీడీపీ అనుకూల మీడియా పెట్టిన మంటలే వైసీపీని మండించేస్తున్నాయట. వారు తాటికాయ అంత అక్షరాలతో జగన్ గ్రాఫ్ ఢమాల్ అని రాస్తే హాట్ అటాక్ రాకుండా ఆగుతుందా. అందుకే వైసీపీ శిబిరం మొత్తం గగ్గోలు పెడుతోంది.ఆత్మానందం భజ గోవిందం అని ఒక సామెత ఉంది. ఎవరికి తోచిన విధంగా వారు అనుకుని మనసులో మురిసిపోవడం అన్న మాట. లేకపోతే జగన్ గ్రాఫ్ ఢమాల్ అని మద్దతు మీడియా రాస్తే అపుడే సీఎం కుర్చీలో బాబు గారు కూర్చున్నట్లుగా ఫీలింగ్ ఏంటి. ఇంకా చాలా కధ ఉంది కదా. ఎన్నికలకు రెండున్నరేళ్ల వ్యవధి కూడా ఉంది కదా. మరి అవన్నీ మరిచేసి ఎవరిని బజ్జోపెట్టడానికి ఎవరిని మభ్యపెట్టడానికి ఈ రాతలు అన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి కార్యోన్ముఖులెవరూ ఇలా ఉండరు. కత్తి పారేసి కాలక్షేపం కూడా చేయరు. సర్వేలు ఎన్నో చెబుతాయి. వాటితోనే రాజకీయం సాగదు కదా. ఆ మాటకు వస్తే ఆ మధ్య చేసిన ఒక లోకల్ సర్వే వైసీపీకి కొంత పలుకుబడి తగ్గింది అంటూనే టీడీపీ ఏ మాత్రం పుంజుకోలేదు అని కూడా చెప్పింది. అందువల్ల భ్రమపడితే, పొరపడితే అంతకంటే నష్టం వేరొకటి లేదు. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. తమ పని తాము చేస్తూ జనాల మెప్పు పొందితేనే రాజకీయ పంట పండేది అన్నదే ఏ పార్టీ అయినా తెలుసుకోవాలి.