తిరుపతి, ఆగస్టు 21,
అధికార పార్టీ ఎమ్మెల్యేలే అయినా.. ఏదో వెలితి. చూస్తుండగానే రెండున్నరేళ్లు పూర్తయిపోతోంది. ఇంకేదో పదవి వారిని ఊరిస్తూనే ఉంది. అవకాశాలు వస్తాయో లేదో.. పదవుల పంపకం ప్రస్తావనకు వస్తే మాత్రం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఓ పదవిపై గురిపెట్టారట. చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలుంటే.. 13 చోట్ల గెలిచింది వైసీపీ. వైసీపీ అధికారంలోకి వచ్చినా.. స్థానిక నేతలకు, గెలిచిన ఎమ్మెల్యేలకు పదవులు రాలేదనే బాధ అలాగే ఉండిపోయింది. కొందరు కేబినెట్‌లో చోటు కోసం.. ఇంకొందరు నామినేటెడ్ పోస్టులపైనా ఆశలు పెట్టుకుని రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ జాబితాలో జిల్లాలో ముందు వరసలో ఉంటారు నగరి ఎమ్మెల్యే రోజా.. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఇటీవలే రోజా దగ్గర ఉన్న APIIC ఛైర్‌పర్సన్ పదవినీ వెనక్కి తీసేసుకున్నారు. దీంతో ఆమె అనుచరులు డీలా పడ్డారట.రెండు ఎన్నికల్లో పీలేరులో బలమైన నల్లారి కుటుంబంపై గెలుస్తూ వస్తున్నారు ఎమ్మెల్యే చింతల. పార్టీలో, నియోజకవర్గంలో పేరు సంపాదించినా మరో పదవి దక్కలేదు. ఇరవై ఏళ్ల పోరాటానికి ఫలితం ఏంటని ఎమ్మెల్యే మథన పడుతున్నారట. పదవుల పందేరం చేపట్టిన ప్రతిసారీ ఆశ పడటం.. చివరకు జావకారిపోవడం అలవాటైపోయిందట చింతల వర్గానికి.2014కు ముందు వరకు ఎమ్మెల్యే కావడమే రోజా ఆశయం. పార్టీ అధికారంలోకి వచ్చాక సహజంగానే ఫైర్‌బ్రాండ్ మంత్రి అవుతారని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ.. అనుభవం, అవసరం, సామాజిక కోణాలు రోజాను మంత్రిని కానివ్వలేదు. దీంతో ఆమె మొదటి నుండి కలలుకంటున్న మంత్రి పోస్టు అలానే ఉండిపోయింది. పైగా ఉన్న పదవి నుండి తప్పించడంతో రోజా అనుచరులు అయోమయంలో పడ్డారట. తాజాగా టీటీడీ పాలకమండలి వేస్తున్న సమయంలో రోజా, చింతల పేర్లు జిల్లాపార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. పార్టీనే నమ్ముకొని ఉన్న చింతల, రోజాలకు బోర్డు సభ్యులుగా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ, దీన్ని ఎమ్మెల్యే రోజా అనుచరులు కొట్టిపారేస్తున్నారు. తమ ఎమ్మెల్యేకి మంత్రి పదవి గ్యారెంటీ అంటున్నారట. రోజా సైతం అదే ధీమాతో ఉన్నట్టు సమాచారం.పీలేరు ఎమ్మెల్యే చింతలకు టీటీడీ బోర్డు దక్కే అవకాశం మెండుగా ఉన్నాయట. చింతల దగ్గర కేడర్ ఈ మాటలను ప్రస్తావిస్తే.. చాలావాటి మీద ఆశలు పెట్టుకున్నాం.. చూద్దాం చివరి ప్రయత్నంలో ఏం జరుగుతుందో అని బదులిచ్చారట. ఇన్నేళ్లు పార్టీకి సేవ చేశాను. ఇప్పుడు దేవదేవునికి సేవ చేసే అవకాశం ఇప్పించాలని సీఎం జగన్‌ను ఎమ్మెల్యే కోరినట్టు టాక్. వీరే కాకుండా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా తమకు ఓ అవకాశం ఇవ్వాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా విజ్ఞప్తి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ దఫా పదవి వస్తే వచ్చినట్టు లేదంటే లేనట్టే అన్న బాధ ఎమ్మెల్యే శిబిరంలో ఉందట. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ వైసీపీ లీడర్లు కలిసినా రోజా, చింతల గురించే చర్చిస్తున్నారట. మరి.. ఏం జరుగుతుందో.. ఎవరికి ఏ పదవీ యోగం ఉందో చూడాలి.