హైదరాబాద్, ఆగస్టు 21,
ఈటల రాజేందర్…తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. మొదట నుంచి టీఆర్ఎస్‌లో కీలకంగా పనిచేస్తున్న నాయకుడు. కేసీఆర్‌కు కుడి భుజంగా ఉన్న నేత. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండోసారి మంత్రిగా పనిచేస్తున్న ఈటలపై అనూహ్యంగా భూ కబ్జా ఆరోపణలు రావడం, ఆ ఆరోపణలపై కేసీఆర్ విచారణకు ఆదేశించడం, అలాగే ఈటలని మంత్రివర్గం నుంచి తప్పించడం జరిగిపోయాయి. మంత్రివర్గం నుంచి తప్పించగానే ఈటల, టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరి…మరొకసారి హుజూరాబాద్ బరిలో నిలబడ్డారు.అయితే తాను ఎలాంటి భూ కబ్జా చేయలేదని ఈటల చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ గతంలో గులాబీ పార్టీ ఓనర్లమని ఈటల అనడంతోనే, ఆయనపై కబ్జా ఆరోపణలు చేసి, మంత్రివర్గం నుంచి తప్పించారని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరిగింది. కాదు కాదు ఈటల నిజంగానే కబ్జాకు పాల్పడ్డారని, ఆయనపై విచారణ జరుగుతుందని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే టీఆర్ఎస్‌లో చాలామంది నాయకులు భూకబ్జాలు చేసినవారే అని, కావాలనే ఈటల ఒక్కరినే మంత్రి పదవి నుంచి తప్పించారని ప్రతిపక్షాలు మాట్లాడాయి.అయితే ఏది ఎలా జరిగిన ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి, హుజూరాబాద్ బరిలో మళ్ళీ నిలబడ్డారు. ఇక అక్కడ ప్రజలు కూడా ఈటలకే మద్ధతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈటలని కావాలనే మంత్రివర్గం నుంచి తప్పించారనే అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే హుజూరాబాద్‌లో ఈటలపై ప్రజల్లో సానుభూతి ఎక్కువగా ఉంది.ఆ సానుభూతి ఇంకా పెంచకూడదనే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే భూ కబ్జా కేసు ఏమైందో ఎవరికి తెలియడం లేదు. మొదట్లో కేసీఆర్ విచారణకు ఆదేశించగానే, ఏసీబీ అధికారులు కాస్త దూకుడు ప్రదర్శించారు. కానీ తర్వాత నుంచి ఈ కేసు తెలంగాణ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. టీఆర్ఎస్ సైతం ఈ కేసు గురించి మాట్లాడటం లేదు. ఒకవేళ ఈ కేసుని కదిపితే మరింతగా ఈటలకు సానుభూతి వస్తుందని టీఆర్ఎస్ నేతలు దీనిపై ఏం మాట్లాడటం లేదని తెలుస్తోంది.