విజయవాడ, ఆగస్టు 21,
వైసిపి నేతలకు హనీ ట్రాప్స్ గట్టి షాక్ లే ఇస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ ట్రాప్ లో పడి హాట్ టాపిక్ గా మారారు. ఒక మహిళను ఒక అరగంట వచ్చి కలవాలంటూ మంత్రి అవంతి ఆడియో వైరల్ గా మారిపోయింది. గతంలో ఇదే రీతిలో ప్రస్తుత సత్తెనపల్లి ఎమ్యెల్యే అంబటి రాంబాబు, ఎస్వీబిసి చైర్మన్ గా ఉన్న సమయంలో నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వి బాధితులు అయ్యారు. ఈ ఉదంతాలలో అంబటి రాంబాబు ట్రాప్ తరువాత ఎమ్యెల్యే టికెట్ వైసిపి నుంచి దక్కించుకుని విజేతగా నిలవడం గమనార్హం. ఇక నటుడు పృథ్వి తన పదవికి రాజీనామా చేయాలిసి వచ్చింది. ఇప్పుడు ఒక మహిళ తో అవంతి మాట్లాడినట్లు సోషల్ మీడియా లో చక్కెర్లు కొడుతున్న సంభాషణ వ్యవహారంలో జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయం. తన ఎదుగుదలను చూసి తట్టుకోలేక రాజకీయ ప్రత్యర్ధులు మహా కుట్రే ఈ ట్రాప్ ఆడియో అంటూ క్లారిటీ ఇచ్చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్ . గతంలో కూడా ఇలాంటి కుట్రలే తనపై చేశారని వాటిని పట్టించుకోలేదని అయితే ఏ తప్పు చేయనందున ప్రజా జీవితంలో ఉన్నందున మీడియా ముందుకు ధైర్యంగా వచ్చి చెబుతున్నట్లు ప్రకటించారు అవంతి శ్రీనివాస్. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశా అని తప్పు చేయనందున తమ పార్టీ అండగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.అయితే అవంతి శ్రీనివాస్ ఆడియో తో పాటు ఒక వీడియో కాల్ స్క్రీన్ షాట్, వాట్స్ అప్ చాట్ కూడా సోషల్ మీడియా లోను టిడిపి అనుకూల మీడియా లో బాగా హల్చల్ చేస్తున్నాయి. దాంతో డ్యామేజ్ కంట్రోల్ కోసమే అవంతి శ్రీనివాస్ మీడియా ముందుకు రాక తప్పలేదు. మహిళలతో ఆడియో వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు నేతలు జాగ్రత్తగా లేకపోతే బజారున పడతారని ఇలాంటి సంఘటనలు చెప్పక చెబుతున్నాయి. మరి ఈ వ్యవహారాన్ని వైసిపి సీరియస్ గా తీసుకుంటుందా లేక లైట్ తీసుకుని ఆయనకు అండగా నిలబడుతుందా అన్నది వేచి చూడాలి.