150 మంది భారతీయల బందీ..?
కాబూల్, ఆగస్టు 21,
ఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఖర్జాయ్ విమానాశ్రయం వద్ద సుమారు 150 మందిని తాలిబన్లు బంధించినట్లు తెలుస్తోంది. దాంట్లో చాలా వరకు ఇండియన్లే ( Indians Captured ) ఉన్నారని ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడైంది. గత ఆదివారం కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత.. ఆ దేశం నుంచి పారిపోయేందుకు పౌరులు విమానాశ్రయానికి బారులు తీరుతున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద హృదయవిదారకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. పిల్లలతో ఇనుప కంచెలను దాటేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు అందర్నీ కలచివేస్తున్న విషయం తెలిసిందే. కొందరైతే కంచె అవతల ఉన్న సైనికుల చేతుల్లోకి తమ పిల్లల్ని వదిలేస్తున్నారు. తాము ప్రాణాలు దక్కించుకోకున్నా.. కనీసం తమ పిల్లల్ని అయినా సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని వేడుకుంటున్నారు.150 మందిని కిడ్నాప్ చేసినట్లు వస్తున్న వార్తలను తాలిబన్ ప్రతినిధి అహ్మదుల్లా వసీక్ ఖండించారు. ఆఫ్ఘన్ మీడియాతో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. అయితే దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులు క్షేమంగా ఉన్నారని, వారిని త్వరలోనే విడిచిపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న వారిని తరలించేందుకు అన్ని దేశాలు తమ ఎంబసీల ద్వారా తరలింపు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఇండియా రెండు సైనిక విమానాల ద్వారా వందల మందిని తరలించింది. ఇవాళ కూడా ఓ సైనిక విమానం 85 మంది భారతీయులతో బయలుదేరింది. తజకిస్తాన్ మీదుగా ఆ విమానం ఇండియా వస్తున్నట్లు తేలింది. ఇక అమెరికా కూడా తమ దేశీయుల్ని కాపాడేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది. అయితే ఖర్జాయ్ విమానాశ్రయానికి వేలాదిగా వస్తున్న పౌరుల్ని నియంత్రించడం కష్టంగా మారింది. దీంతో తాలిబన్లు వారిని బంధిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆఫ్ఘన్ జైళ్లలో ఉన్న పాక్ ఉగ్రవాదులను తాలిబన్లు విడిచిపెడుతున్నారు.తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదార్ శనివారం కాబూల్ చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆయన కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. జిహాదీ నేతలు, రాజకీయవేత్తలతో బరాదార్ ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. గత ఆదివారం తాలిబన్లు కాబూల్‌ను వశపరుచుకున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల రాజ్యంగా మారింది. అయితే ప్రభుత్వ ఏర్పాటు అక్కడ కీలకంకానున్నది.తాలిబన్ నేత బరాదార్‌ను 2010లో పాకిస్థాన్‌లో అరెస్టు చేశారు. అమెరికా వత్తిడి వల్ల ఆయన్ను 2018 వరకు కస్టడీలో ఉంచారు. ఆ తర్వాత ఆయన్ను ఖతార్‌కు తరలించారు. దోహాలో ఉన్న తాలిబన్ పొలిటికల్ ఆఫీసుకు అధిపతిగా అతన్ని నియమించారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికన్ దళాలు వెనక్కి వెళ్లడానికి కీలకమైన సమావేశాలను ఆయనే నిర్వహించారు. దోహాలో జరిగిన శాంతి ఒప్పందాల్లో పాల్గొన్నారు. నిజానికి ఖతార్ నుంచి మూడు రోజుల క్రితమే బరాదార్ తాలిబన్లకు కేంద్రమైన కాందహార్ చేరుకున్నాడు.