90 రోజుల్లోగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ:సిఎం జగన్‌మోహన్‌రెడ్డి
అమరావతి ఆగష్టు 23
90 రోజుల్లోగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘‘నిర్మాణ సామాగ్రిలో క్వాలిటీ ప్రమాణాలు పాటించాలి. విద్యుదీకరణకు అవసరమైన సామాగ్రి కూడా అందుబాటులో ఉంచాలి. ఇళ్లు కట్టి ఇచ్చే పనులు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కావాలి. జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. 90 రోజుల్లోగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి’’ అని అన్నారు.టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష సందర్భంగా.. ఫేజ్–1లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, డిసెంబర్ 2021 నాటికల్లా ఈ ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామన్న చెప్పారు.పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే ప్లాట్లు పథకాన్ని కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. దాదాపు 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్ ఉందని అధికారులు తెలిపారు. 150, 200, 250 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు.. వివిధ రకాలుగా భూముల గుర్తింపు, సమీకరణ చేస్తున్నామన్నారు. విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధంచేసి అమలు తేదీలు ప్రకటించాలని సీఎం ఆదేశించారు. జగనన్న కాలనీలు, మౌలిక వసతులపై సమీక్షించారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు.