ఏపీ రాజకీయాల్లో కీలకమైన, ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. ఎవరు ఎవరికి మిత్రులవుతారో అనే ఉత్కంఠ అందరిలోనూ పెరుగుతోంది. ప్రస్తుతానికి ఒక క్లారిటీ రాకపోయినా.. నేతలు మాత్రం పొత్తుల దిశగానే అడుగులేస్తున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-వైసీపీ-జనసేన కలిసి పోటీచేసే అవకాశాలు ఉన్నాయని, అందుకే టీడీపీనే టార్గెట్ చేస్తున్నారని సీఎం చంద్రబాబే స్వయంగా పలుమార్లు ప్రస్తావిస్తున్నారు. మరి వీటన్నింటికీ మరింత బలం చేకూర్చేలా వైసీపీ లీగల్ సెల్ నేతలతో జనసేన నేతలు భేటీ అయ్యారు. ఇందులో జనసేన కీలక నేతలైన శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి, పవన్ వ్యక్తిగత సహాయకులు వేణు, చక్రవర్తి పాల్గొన్నారు. వైసీపీ తరఫున సమావేశానికి వచ్చిన నేతలెవ్వరన్న విషయం తెలియరాలేదు. తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీపై అటు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ముందు ఇంటర్నల్‌గా ఇరు పార్టీల మధ్య ఇంటర్నల్ పొత్తులు ఉంటాయా నిజమైన పొత్తులు ఉంటాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ముఖ్యంగా గత ఎన్నికల్లో జట్టు కట్టిన పార్టీలన్నీ ఇప్పుడు తలో దారిలో వెళుతున్నాయి. మిత్రులయిన టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల నేతలు ఇప్పుడు శత్రువులుగా మారారు. గత ఎన్నికల్లో అందరికీ ఉమ్మడి శత్రువుగా ఉన్న వెఎస్సార్ సీపీ అధినేత జగన్.. ఇప్పుడు టీడీపీ మినహా మిగిలిన వారికి మిత్రుడిగా మారిపోతున్నాడనే సంకేతాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. వైఎస్సార్ సీపీ- జనసేన నేతల భేటీతో ఈ సంకేతాలకు మరింత బలం చేకూరిందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన ఈ భేటీపైనే అందరి దృష్టి పడింది.ఏపీలో ఏం జరుగుతోంది? టీడీపీ నేతలు విమర్శిస్తున్నట్లుగానే వైసీపీ-జనసేన మధ్య పొత్తు పొడిచిందా? ఒకవేళ అదే నిజమైతే రాష్ట్ర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? వచ్చే ఎన్నికలకు పొత్తులపై ఈ ఇరు పార్టీల నేతలతో ఒక చిన్న క్లారిటీ వచ్చినట్టేనా? అనే ప్రశ్నలు అందరిలోనూ వినిపిస్తున్నాయి. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చిన తర్వాత.. రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. బీజేపీపై సీఎం చంద్రబాబు విమర్శల దాడి చేస్తున్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందంటూ బోనులో ముద్దాయిని చేసి నడిరోడ్డుపై నిలబెట్టేశారు. ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత పెంచేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. మరోపక్క చంద్రబాబుకు పక్కలో బల్లెంలా తయారయ్యారు జనసేన అధినేత పవన్, ప్రతిపక్ష నేత జగన్.ఒకరు హోదా విషయంలో టీడీపీని ఇరుకున పెడుతుంటే మరొకరు అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ మరో వైపు నుంచి ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్రానికి హోదా తీసుకురావడంలో బాబు విఫలమయ్యారని జగన్ విమర్శలు గుప్పి స్తున్నారు. ఇదే సమయంలో హోదా ఇస్తామని మోసగించిన బీజేపీని ఇప్పటివరకూ విమర్శించిన దాఖలాలు లేవు. ఇక పవన్ కూడా హోదా విషయంలో తొలినాళ్లలో బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తర్వాత ఎందుకో సైలెంట్ అయిపోయారు. ఆయన సీఎం చంద్రబాబు, టీడీపీ అవినీతిపైనే దృష్టిపెట్టినట్టు కనిపిస్తున్నారు. అందుకే వీలు దొరికినప్పుడల్లా టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిని బట్టి ఈ ఇద్దరు నాయకుల టార్గెట్ చంద్రబాబే అనేది తేలిపోయింది. దీంతో వీరిద్దరి మధ్య అవగాహన కుదిరిందని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.