YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న గులాబీ బాస్

సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న గులాబీ బాస్

తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మ‌నేత‌, టీఆర్ఎస్ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయారా..? ఆయ‌న వ్యూహాలు బెడిసికొడుతున్నాయా..? ప‌్ర‌త్య‌ర్థిని త‌క్కువ‌గా అంచ‌నా వేసి పొర‌పాటు చేశారా..? గులాబీ బాస్ తీరుతో పార్టీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నాయా..? అంటే ఇటీవ‌లి ప‌రిణామాలు నిజ‌మేన‌ని చెబుతున్నాయి. ఇటీవ‌ల సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార శైలితో పార్టీలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నిజానికి కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్సాహం క‌నిపిస్తోంది. ఇక ప్ర‌జాచైత‌న్య బ‌స్సుయాత్ర త‌ర్వాత అది మ‌రింత‌గా పెరిగింది. అక్క‌డ‌క్క‌డ చిన్న‌చిన్న ఘ‌ట‌న‌లు త‌ప్ప నేత‌లంద‌రూ క‌లిసిక‌ట్టుగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌భ‌ల‌తో శ్రేణుల్లో నూత‌నొత్తేజం క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో నేత‌లు ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఇత‌ర పార్టీల నుంచి కూడా వ‌ల‌స‌లు పెరిగాయి. ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటుండ‌డంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుకు సీఎం కేసీఆర్ ఏం చేయ‌బోతున్నార‌న్న‌దానిపైనే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో, ఆశ‌వ‌హుల్లో హైటెన్ష‌న్ నెల‌కొంది.తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్‌కు స‌బ్బండ‌వ‌ర్గాలు మ‌ద్ద‌తు తెలిపాయి. సీపీఎం త‌ప్ప ప్ర‌జాసంఘాలు, విద్యార్థి సంఘాలు, జేఏసీ, అన్నిపార్టీలు అండ‌గా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఉద్య‌మాన్ని ముందుకుతీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించ‌గ‌లిగార‌నే వాద‌న బ‌లంగా ఉంది. కానీ, అధికారంలోకి వ‌చ్చిన‌త‌ర్వాత గులాబీ బాస్ వ్య‌వ‌హార శైలితో దాదాపుగా జేఏసీ నుంచి మొద‌లు ప్ర‌జాసంఘాలు, విద్యార్థి సంఘాలు దూర‌మ‌య్యాయి. అవే ఇప్పుడు ముఖ్య‌మంత్రిపై దాడి చేస్తున్నాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీని, జేఏసీని సీఎం కేసీఆర్ త‌క్కువ‌గా అంచ‌న‌వేశారు. కానీ, ఇప్పుడు ఆయ‌న అంచ‌నాలు త‌ప్పుతున్నాయి. వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి.జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం తెలంగాణ జ‌న స‌మితి పార్టీని ఏర్పాటు చేశారు. మొద‌ట కోదండ‌రాం పార్టీ ఏర్పాటు చేసినా పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌ద‌ని కేసీఆర్ భావించిన‌ట్లు స‌మాచారం. కానీ, టీజేఎస్ పార్టీ ఆవిర్భావ స‌భకు ఊహించ‌ని సంఖ్య‌లో జ‌నం రావ‌డం, విజ‌య‌వంతం కావ‌డంతో గులాబీ బాస్ అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. ఇదే ఉత్సాహంతో కోదండ‌రాం వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తాచాటేందుకు కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్టారు. రాష్ట్ర సాధన ఉద్యమం లో ముందుండి పోరాడిన ఉద్యమకారులను అక్కున చేర్చుకునేందుకు తెలంగాణ జన సమితి కసరత్తు చేస్తోంది.రాష్ట్రం వచ్చాక కనీస గుర్తింపునకు నోచుకోని పలువురిని పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలను, అసంతృప్తితో ఉన్న ఉద్యమకారులను దగ్గర చేసుకుని పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళికలు రచిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం గ్రామాలవారీగా ఉద్యమకారుల వివరాల సేకరణలో టీజేఎస్‌ యంత్రాంగం నిమగ్నమైంది. ఇలా అటు కాంగ్రెస్‌, ఇటు టీజేఎస్ బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులుగా మారుతుండ‌డంతో టీఆర్ఎస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలవ‌డం అంత సులువుకాద‌నే టాక్ వినిపిస్తోంది. దీనిని ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికే సీఎం కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు ముచ్చ‌ట మొద‌లుపెట్టార‌నే విమర్శ‌లు వినిపిస్తున్నాయి.పార్టీలో కూడా ప‌లువురు కీల‌క నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు తీవ్ర‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో ప్ర‌త్య‌ర్థులు బ‌ల‌ప‌డుతున్న వేళ కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్ర‌య‌త్నం చేయ‌డంపై సొంత‌పార్టీ నేత‌ల్లో కూడా అసంతృప్తి నెల‌కొంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు కూడా కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా నివేదిక‌లు తెప్పించుకుంటున్న కేసీఆర్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డార‌నే టాక్ వినిపిస్తోంది.

Related Posts