విజయవాడ, ఆగస్టు 24,
ఔను… బీజేపీ కనుక టీడీపీతో చేతులు కలిపితే.. అది జగన్ చేసుకున్న స్వయంకృత అపరాధమే అవుతుందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం బీజేపీ అవసరం జగన్‌కు ఎంత ఉందో.. అంతకన్నా ఎక్కువగా టీడీపీకి ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీతోనే చేతులు కలిపి అధికారం దక్కించుకుంది. కేంద్రంలోనూ మంత్రి పదవులు దక్కించుకుంది. 2019 ఎన్నికలకు వచ్చే సరికి బీజేపీని విడిచిపెట్టి ఒంటరి పోరు చేసింది. ఇది అప్పట్లో కరెక్టేనని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. అయితే.. రాను రాను పరిస్థితులను సమీక్షించుకున్న సీనియర్లు.. అది చాలా పెద్ద తప్పని నిర్ణయానికి వచ్చారు.దీంతో అప్పటి నుంచి తిరిగి బీజేపీతో చేతులు కలిపేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎప్పుడు అవకాశం చిక్కినా.. బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలని భావిస్తోంది. ఇక, ఇప్పుడు.. టీడీపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. వచ్చే ఎన్నికల్లో మీరు అడిగిన సీట్లు ఇస్తాం.. కలిసి పోటీ చేద్దాం.. అని చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.. కేంద్రంలో మంత్రిగా కూడా చక్రం తిప్పిన నేత బీజేపీకి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం టీడీపీకి ఉన్న వ్యతిరేకత, పుంజుకుంటుందో లేదో తెలియని సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఈ విషయంపై ఎటూ తేల్చలేదు.ఇదిలావుంటే.. మరోవైపు.. బీజేపీనే స్వయంగా.. జగన్‌తో జట్టుకట్టేందుకు రెడీ అవుతోంది. కేంద్రంలో అవసరాలే దీనికి ప్రధాన ప్రాతిపదికగా ఉన్నాయి. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో జగన్ నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. అదే సమయంలో మోడీ ముచ్చటగా మూడోసారి కూడా ప్రధాని అవ్వాలంటే.. జగన్ మద్దతు అప్పటికి అవసరమైన అనివార్య పరిస్థితి రానుంది. ఈ క్రమంలో బీజేపీ కొన్నాళ్లుగా జగన్‌ను బుజ్జగిస్తోంది. కీలక నిర్ణయాలు తీసుకోకపోయినా.. జగన్‌కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వడంతోపాటు.. పార్టీ నేతలు.. జగన్‌పై విమర్శలు చేయకుండా.. ముఖ్యంగా మిత్రపక్షం జనసేనను కట్టడి చేయడంలోనూ.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు పరోక్షంగా సహకరిస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పుడు జగన్ బీజేపీతో చేతులు కలిపితే.. ఒక విధంగా రాజకీయాలు మారనున్నాయి. అలాకాకుండా.. ఆయన బెట్టుకుపోయి.. బీజేపీని కాదంటే.. ఆ లోటును భర్తీ చేసేందుకు టీడీపీ కాచుకుని కూర్చుంది. బీజేపీ కూడా జగన్ ను బతిమాలకుండా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. మొత్తానికే జగన్‌కు ఇబ్బందులు రావడంతోపాటు ఏపీలో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మలుపుతిరిగి.. వైసీపీకి నష్టం చేకూరుస్తాయని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో బీజేపీ-టీడీపీ జట్టుకడితే.. అది జగన్‌దే తప్పవుతుందని అంటున్నారు. మరి సీఎం ఏం చేస్తారో చూడాలి.