గుంటూరు, ఆగస్టు 24,
గుంటూరు జిల్లాలో రైతులు ప్రస్తుతం పత్తికి ప్రత్యామ్నాయంగా మిర్చి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో, జిల్లాలో ఈ ఏడాది పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గి, మిర్చి విస్తీర్ణం పెరగనుంది. జిల్లాలో 4.24 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 2.44 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఈ నెలాఖరుకు మరో లక్ష ఎకరాల్లో సాగవురతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి 3.60 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారు. పత్తి సాగుకు ఈ నెలాఖరు వరకు సమయం ఉందని అధికారులు తెలిపారు.మిర్చి సాధారణ సాగు 1.84 లక్షల ఎకరాలుగా అంచనా వేయగా ఈ ఏడాది ఇప్పటికే 2.50 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మిర్చి 44 వేల ఎకరాల్లో సాగైంది. మిర్చి సాగుకు సెప్టెంబరు 15 వరకు అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. పత్తికి గతేడాది ఆశించిన ధరలు రాకపోవడం, దిగుబడులు తగ్గడం, గులాబి పురుగు ప్రభావం, తెగుళ్లు, నకిలీలల బెడద ఇత్యాది కారణాల వల్ల ఈ ఏడాది రైతులు పత్తి సాగుకు కొంతమేరకు వెనుకంజ వేశారు. పత్తి సాగుకు వాతావరణం అనుకూలించడం లేదు. కాయలు కాసి పత్తి చేతికి వచ్చే సమయంలో వర్షాలు రావడం, గులాబి పురుగు కాయలను తినేయడంతో మెట్ట ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో గతేడాది దిగుబడి గణనీయంగా తగ్గింది. పత్తి సాగులో తీవ్ర నష్టాలను చవిచూసిన రైతులు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండఢంతో మిర్చి సాగుకు సన్నద్ధం అవుతున్నారు. మిర్చి క్వింటాలు కనిష్ట ధర రూ.10 వేలకు తగ్గకుండా లభిస్తోంది. గరిష్టంగా 20 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. సీజన్‌లో గరిష్టంగా రూ.12 వేలు పలికినా సీజన్ పూర్తయిన తరువాత రూ.15 వేలకుపైగా వస్తుండడంతో మిర్చి వైపు రైతులు ఆసక్తిగా ఉన్నారు. మిర్చి సాగుకు పెట్టుబడి రూ.లక్ష వరకు అవుతున్నా ఎంతో కొంత ఆదాయం ఉంటుందని భావించిన పత్తి రైతులు పంట మార్పిడిలో భాగంగా ఈ ఏడాదికి మిర్చి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో నీరు పుష్కలంగా ఉండడంతో ఈ ఏడాది మిర్చి సాగుకు నీటి ఎద్దడి ఉండదని భావిస్తున్నారు.