శ్రీశైలం, ఆగస్టు 24,
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు, పేరుకుపోయిన పూడికపై హైడ్రోగ్రాఫిక్ సర్వే శనివారం నుంచి ప్రారంభమైంది. ముంబయికి చెందిన 12 మంది నిపుణులు ఈ సర్వే చేస్తున్నారు. 15 రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుంది. బోటుపైనుంచి పరికరాలను నీటిలోకి పంపి పూడిక ఎంత చేరిందో తేల్చేందుకు సర్వే చేస్తున్నారు. శ్రీశైలం జలాశయ నిర్మాణ సమయంలో నీటి నిల్వ సామర్థ్యం 308.62 టిఎంసిలు ఉండేది. 2009 వరద తర్వాత 215.807 టిఎంసిలకు పడిపోయింది. అప్పట్లో అనూహ్యంగా వచ్చిన వరదలతో పూడిక పేరుకుపోయి ఈ జలాశయం దాదాపు 93 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. తెలుగు రాష్ట్రాల జలాశయాల నిర్వహణను కృష్ణా బోర్డు ఆధీనంలోకి తీసుకోనున్న నేపథ్యంలో ప్రస్తుత నీటి నిల్వను మరోసారి నిర్ధారించేందుకు, పూడికను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ సర్వే జరుగుతోంది. గత పదేళ్లలో ఈ జలాశయంలో ఎంతమేర పూడిక చేరిందో ఈ సర్వే ద్వారా గుర్తించనున్నారు. ఈ జలాశయం ఏటా కొంతమేర పూడుకుపోతోంది. దీంతో, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 25 నుంచి 30 అడుగుల మేర పూడిక పేరుకుపోయినట్లు అంచనా. ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకూ 40 ఏళ్లయినా పూడికతీత చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఏటా దాదాపు 1.5 టిఎంసిల చొప్పున నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. కొండల మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్టు 885 అడుగుల లోతు ఉంటుంది. 2009 నుంచి ఏటా సర్వేలు చేస్తున్నా, పూడిక తీయడం లేదు. 250 ఎకరాల పరిధిలో 30 అడుగుల లోతులో పూడిక ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూడికతీత చిన్న విషయం కాదని, డ్రెడ్జింగ్ వంటి ప్రక్రియల ద్వారా పూడిక తీసే అవకాశం ఉన్నా, తీసిన పూడికను వేయడానికి పది వేల నుంచి 20 వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూడిక వల్ల లైవ్ స్టోరేజీకి ఎటువంటి ప్రమాదమూ ఉండదని చెబుతున్నారు. డెడ్ స్టోరేజీలోని భాగంలో మాత్రమే పూడిక ఉంటుందని, పూడిక తీయడానికి వీల్లేని విధంగా డెడ్ స్టోరేజీలో ఎప్పుడూ 30 టిఎంసిలు ఉంటాయని అంటున్నారు. ఈ జలాశయంలో సర్వే పూర్తి కాగానే కర్నూలు పరిసరాల్లోని సుంకేసుల, గాజులదిన్నె వంటి ప్రాజెక్టుల్లో సర్వే జరగనుందని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎఇ అనిల్‌కుమార్ తెలిపారు. పూడికతీతకు తుంగభద్రలో గతంలో ప్రయత్నించినా సాధ్యం కాక వదిలేశారు. శ్రీశైలంలో మళ్లీ సర్వేతోనే సరిపెడతారో? లేదా ఈసారైనా పూడికతీత తీస్తారో? వేచి చూడాలి.