YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మారుతున్న వలపు వలలు

మారుతున్న వలపు వలలు

మెదక్, ఆగస్టు 24, 
‘మీరు ఒంటరితనంతో సతమతం అవుతున్నారా..? అయితే, ఈ లింక్‌ క్లిక్ చేయండి. మీతో మాట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అంటూ కొందరి మొబైల్ ఫోన్లకు మెస్సేజ్‌‌లు వస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్‌లలో ఇలాంటి ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ఆ లింక్‌పై క్లిక్ చేసి మాట్లాడాలనే ఉత్సాహం చూపించారా..? మీ ఒంటరితనం పోవడం పక్కన పెడితే.. మానసిక ప్రశాంతతతో పాటు లక్షల రూపాయలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. సైబర్‌ క్రైమ్‌లలో మోసం చేస్తూ డబ్బులు గుంజుతున్న గ్యాంగ్‌లు ఇప్పుడు అందమైన అమ్మాయిలతో నగ్న వీడియో కాలింగ్‌ చేయిస్తున్నాయి. ఆ కాల్‌ను రికార్డ్ చేసి.. డబ్బుల కోసం యువకులను బ్లాక్‌ మెయిల్ చేస్తున్నాయి. పరువు పోతుందని చాలా మంది వారు అడిగిన డబ్బులు పంపుతున్నారు. ఇది బయటకు చెప్పుకోలేక సతమతం అవుతున్నారు. నిత్యం డబ్బుల కోసం వేధింపులకు గురిచేస్తుండడంతో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతుండగా.. మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మొదటగా ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో హాయ్ అని మెస్సేజ్ పెడ్తారు. దానికి స్పందిస్తే చాలు.. తాను అమ్మాయినని.. నగ్నంగా వీడియోకాల్ చేస్తానని నమ్మబలకడంతో చాలామంది వారు చెప్పిందల్లా చేస్తూ మోసపోతున్నారు. ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, అహ్మదాబాద్‌, గోవా, భువనేశ్వర్‌, పూణె, చెన్నై, కోయంబత్తూర్‌, కేరళ, కొచ్చి తదితర ప్రాంతాల నుంచి ఫేస్‌బుక్‌ అకౌంట్లలో అమ్మాయిల పేర్లతో అకౌంట్లు తెరుస్తున్నారు. ఆయా అకౌంట్ల నుంచి యువకులకు, వ్యక్తులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపడం వారు ఒకే అనగానే హాయ్‌ అని పలకరింపుతో పరిచయం పెంచుకుంటున్నారు. అనంతరం తియ్యని చాటింగ్‌తో వాట్సాప్‌ నెంబర్‌ తీసుకోవడం వీడియో కాల్‌ చేయడానికి ప్రేరేపించడం క్షణాల్లో జరిగిపోతోంది. మెల్ల మెల్లగా మాటలు కలిపి నగ్న వీడియో కాలింగ్‌ ప్రారంభించి బుట్టలో వేసుకుంటారు. అనంతరం నగ్న వీడియో కాలింగ్‌ సమయంలో స్క్రీన్‌‌షాట్స్‌ తీసుకుని బ్లాక్‌ మెయిలింగ్‌ ప్రారంభిస్తారు. ఆ వీడియోలు తమ స్నేహితులకు, కుటుంబసభ్యులకు పంపుతామని చెప్పి బెదిరింపులకు పాల్పడుతుంటారు. డబ్బులు గూగుల్‌ పే, పోన్‌ పే చేయాలంటూ వసూలు మొదలు పెడతారు వీడియో కాలింగ్ విషయం బయటపెడతామనే సరికి చాలామంది యువకులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఏడాదిపాటుగా ఆసిఫ్‌నగర్‌, టప్పాచబుత్ర, లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ముగ్గురు యువకులు నగ్నవీడియో కాలింగ్‌ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. నగ్న వీడియో కాలింగ్‌కు సంబంధించిన అకౌంట్‌ల నుంచి రాత్రి పది గంటల తర్వాత ఫేస్‌బుక్‌లలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఆ సమయంలో ఒంటరిగా ఉండే యువకులు తీయటి చాటింగ్‌లో పడి తమకు తాముగా మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేయగానే.. వెంటనే హాయ్ అనే మెస్సేజ్‌కు రిప్లే ఇస్తే అంతే సంగతులు. ఇలాంటి వారిపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫేక్‌ ఐడీలతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను గమనించి వెంటనే బ్లాక్‌ చేయాలి. లేదా రిక్వెస్ట్‌ తిరస్కరించాలి. తమ ఫేస్‌బుక్ ఫ్రొఫైల్‌ను లాక్‌ చేసుకుంటే కొంత వరకు జాగ్రత్తగా ఉండవచ్చు. సోషల్‌ మీడియాలో మోసాలకు గురవుతున్న వారు భయానికి గురి కాకుండా కొంచెం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదులు చేస్తే ఇలాంటి వారి మోసాలను అరికట్టొచ్చు. ఇటీవల నగరానికి చెందిన 32 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉదయ్ (పేరు మార్చాం) ఇలాంటి వలలోనే చిక్కుకుని రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడు. అల్వాల్‌కు చెందిన ఉదయ్‌కు నెల రోజుల క్రితం ‘మీరు ఒంటరిగా ఉంటున్నారా..? కాల్ మీ ఎనీ టైమ్.. నా పేరు స్వాతి అంటూ మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌కు అతడు ఆకర్షితుడై కాల్ చేశాడు. అవతలి నుంచి అమ్మాయి మాట్లాడడంతో మనోడిలో ఉత్సాహం రెట్టింపైంది. ఇలా చాటింగ్, కాల్స్‌తో పది రోజులు గడిచిపోయాయి. ఈ సమయంలో ఉదయ్ ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి అవతలి అమ్మాయి తెలుసుకుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో కొన్ని రోజుల తర్వాత ఆమె వీడియో కాల్‌లో నగ్నంగా కనిపించే అమ్మాయిలతో మాట్లాడాలనుకుంటున్నారా అని ఉదయ్‌ను అడిగింది. అందుకు ఉదయ్ ఓకే అన్నాడు. అర్ధనగ్నంగా అయితే రూ. 500, నగ్నంగా అయితే రూ.2000 చెల్లించాలని చెప్పింది. ఇంతేకదా.. అని ఉదయ్ డబ్బులు పంపాడు. అవతలి అమ్మాయి వీడియో కాల్ చేసింది. ఇలా కొన్ని రోజులు గడిచాక.. ఉదయ్‌ను కూడా బట్టలు విప్పమని అడిగింది. ఉదయ్ టెమ్ట్ అయి బట్టలు విప్పాడు. ఆ తర్వాత నుంచి కథ అడ్డం తిరిగింది. అప్పటి వరకు సరదాగా, రొమాంటిక్‌గా సాగిన వ్యవహారం.. బ్లాక్‌మెయిల్ వరకు చేరుకుంది. ఇద్దరూ బట్టలు విప్పుకుని మాట్లాడుకున్న నగ్న వీడియోలను రికార్డ్ చేశానని.. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తానని ఒత్తిడి చేసింది. దీంతో అతడు డబ్బులు పంపాడు. ఇలా తరచూ డబ్బుల కోసం వేధిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించాడు.

Related Posts