హైదరాబాద్ ఆగష్టు 24
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేందుకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రిజర్వేషన్ ఉంటేనే రైలులో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో రైల్వేశాఖ సడలింపులు ఇస్తోంది. ఇకపై జనరల్ బోగీ ప్రయాణానికి రిజర్వేషన్ అవసరం లేదని పేర్కొంది. తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్ కౌంటర్లలో అన్‌రిజర్వుడ్ టికెట్ కొనుగోలు చేసి ప్రయాణం చేసుకోవచ్చు. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని 74 రైళ్లలో జనరల్ బోగీలను రిజర్వేషన్ నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపింది. ఇందులో సికింద్రాబాద్ డివిజన్‌లో 29, విజయవాడ డివిజన్‌లో 12, నాందేడ్‌లో 12, గుంతకల్లులో 10, హైదరాబాద్‌లో ఆరు, గుంటూరులో ఐదు రైళ్లు ఉన్నాయి.