న్యూఢిల్లీ ఆగష్టు 24
అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పైశాచికం పెరిగిపోవడంతో.. అక్కడ ఉన్న మూడు సరూపాలను సిక్కులు ఇండియాకు తీసుకువచ్చారు. ఆ మూడు పవిత్ర గ్రంథాలు ఇవాళ ప్రత్యేక విమానంలో ఇండియాకు చేరాయి. కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురి.. ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి ఆ గ్రంథాలను తీసుకువచ్చారు.కాబూల్ నుంచి ప్రత్యేక విమానంలో మూడు సిక్కు గ్రంథాలను ఇవాళ ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఆ సరూపాలను మంత్రి హరిదీప్ అందుకున్నారు. ఆ గ్రంథాలను తలపై పెట్టుకుని ఆయన విమానాశ్రయం బయటకు వచ్చారు. సిక్కు మతంలో గురు గ్రంథ్ సాహిబ్ కు విశిష్ట స్థానం ఉంది. సిక్కు మతస్తులు ఆ గ్రంథాలను అత్యంత పవిత్రంగా చూస్తారు. ఆ గ్రంధాలను బ్రతికి ఉన్న గురువులుగా వాళ్లు భావిస్తారు. ఆ గ్రంథాల్లో ఉన్న గుర్బానీలు.. అంటే పది మంది సిక్కు గురువులు బోధించిన సూత్రాలు ఆ పవిత్ర గ్రంధాల్లో ఉంటాయి. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ బోధనలు కూడా ఆ గ్రంథాల్లో నిక్షిప్తం అయ్యాయి. ఆ విమానంలో 46 మంది సిక్కులు కూడా ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చారు. నిజానికి సిక్కు మత గురువు గురు నానక్ దేవ్.. 16వ శతాబ్ధంలో ప్రచారం కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారు. అక్కడ ఆయన అనేక నగరాలను పర్యటించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంతో సిక్కులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆ దేశంలోనే గురు గ్రంథ్ సాహిబ్‌కు చెందిన 13 సరూపాలు అక్కడే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఏడు గ్రంథాలను ఇండియాకు తరలించారు. తాజాగా మూడు గ్రంథాలను తీసుకువచ్చారు. ఇంకా మిగితా మూడు పవిత్ర గ్రంథాలు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.