YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ధాన్యం ఉత్పత్తి అంచనాపై సమీక్ష

ధాన్యం ఉత్పత్తి అంచనాపై సమీక్ష

హైదరాబాద్
వానాకాలంలో  ధాన్యం ఉత్పత్తి అంచనా, కొనుగోళ్లపై బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మార్కెటింగ్, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ, ఎఫ్ సీఐ అధికారులతో సమీక్షా సమావేశం  నిర్వహించారు. ఈ సమావేశంలో  సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,  సివిల్ సప్లై కమీషనర్ అనిల్ కుమార్,  స్పెషల్ కమీషనర్ హన్మంత్,  మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి, ఎఫ్ సి ఐ జీఎం దీపక్ శర్మ,  వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.  మంత్రి మాట్లాడుతూ ఈ వానాకాలం 55 లక్షల ఎకరాలలో వరి సాగు జరుగుతుంది. ఎకరానికి సరాసరి 27 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా మేరకు ఒక కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేస్తున్నాం.  వానాకాలం ఉత్పత్తిలో ఎఫ్ సీ ఐ ఇప్పటికే సేకరణకు అంగీకరించిన ధాన్యం 60 లక్షల మెట్రిక్ టన్నులు. దీనికి అదనంగా ఎఫ్ సీ ఐ మరో 15 నుండి 20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని వినతి .. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తాం. ఇతర రాష్ట్రాలకు 20 లక్షల మెట్రిక్ టన్నుల మన ధాన్యం వెళ్తుందని అంచనా. రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజల  ఆహార అవసరాల నిమిత్తం ఏడాదికి సరాసరి వినియోగించే బియ్యం 56 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేస్తున్నాం. దీనికి గాను 83.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవుతుంది. వర్షాలు ఆలస్యం కావడంతో కొంత  పత్తి సాగు తగ్గి వరి సాగు పెరిగింది. మన రాష్ట్రం నుండి ధాన్యాన్ని సేకరించే కర్ణాటక, తమిళనాడు, కేరళలలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతూ వస్తుంది. పంజాబ్ లో పెద్ద ఎత్తున వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నా అక్కడ వినియోగం లేదు. వానాకాలం ధాన్యం ఉత్పత్తులు వచ్చే సమయానికి రాష్ట్రంలో ఇప్పటికే నిలువ ఉన్న గత యాసంగి ధాన్యం నిల్వలను ఖాళీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎఫ్ సీఐకి సూచించాము. ఇబ్బందులు రాకుండా అవసరమైతే ఉత్తర భారతదేశం మాదిరిగా బహిరంగ ప్రదేశాల్లో ధాన్యం స్టోరేజికి గల అవకాశాలను  పౌరసరఫరాల శాఖ పరిశీలించాలని అన్నారు.
కర్ణాటక, తమిళనాడు, కేరళలలో దొడ్డు వడ్ల వినియోగం తగ్గిన నేపథ్యంలో ఈ సారి ఎఫ్ సీ ఐ దొడ్డు వడ్లను సేకరించడంలేదని సమావేశంలో ఎఫ్ సీఐ జీఎం దీపక్ శర్మ సూచించారు. మంత్రి మాట్లాడుతూ ఈ నేపథ్యంలో రైతాంగం యాసంగిలో దొడ్డు రకం వడ్లను సాగు చేయొద్దని .. సన్న రకాలనే సాగు చేయాలని విజ్ఞప్తి చేద్దాం. వీలైనంత మేరకు వరి సాగును తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయంగా వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు వంటి తక్కువ పెట్టుబడి అయ్యే నూనెగింజల పంటల సాగు మూలంగా రైతాంగానికి లాభం ఉంటుంది. యాసంగిలో వడగండ్ల వానలు, అకాల వర్షాలు, గాలివానలతో రైతులు పంటలు నష్టపోకుండా మార్చి 31 లోపు పంటలు కోతకు వచ్చేలా చూసుకోవాలి. మార్చి 31 తర్వాత ఊష్ణోగ్రతల మూలంగా నూక శాతం పెరిగి మిల్లింగ్ శాతం తగ్గే అవకాశం వుంది. వ్యవసాయ శాఖ రైతులను ఈ విషయంలో చైతన్యం చేయాలి. రాష్ట్రంలో గోదాంల సమస్య తీవ్రంగా ఉంది .. అన్ని గోదాంలు రాష్ట్రంలో ధాన్యం, ఇతర పంటలతో నిండుగా ఉన్నాయి .. ఇవి వానాకాలం పంటలు వచ్చే నాటికి ఖాళీ అయ్యే అవకాశం తక్కువగా ఉంది. రాష్ట్రంలో గోదాంల నిల్వ సామర్థ్యం పెంచేందుకు త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ వద్ద 40 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంల నిర్మాణానికి డీపీఆర్ సిద్దంగా ఉంది. ఆసక్తిగల వారికి నిర్మాణ ఖర్చులో సబ్సిడీ ఇస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ నిల్వ సామర్ద్యం వచ్చే అవకాశం ఉందని సమావేశంలో ప్రతిపాదనలు చేసారు. ఈ విషయంపై అద్యయనం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్  దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

Related Posts