విశాఖపట్టణం, ఆగస్టు 25,
తెలుగుదేశం పార్టీలో కొన్ని పదవులు అచ్చి రావు అంటారు. అందులో తెలుగు యువత, తెలుగు మహిళ రాష్ట్ర పదవులను ఎక్కువగా చెప్పుకుంటారు. ఈ పదవులు అలంకరించిన వారి రాజకీయ జీవితం సాఫీగా సాగిన ఉదంతాలు లేవు. ఎన్టీయార్ హయాంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగు యువత అధ్యక్షుడిగా ఉండేవారు. కానీ ఆయన జాతకం బాగాలేక రాష్ట్ర మంత్రి పదవి నుంచి ఢిల్లీ రాజకీయాలకు బదిలీ అయిపోయి ఆ మీదట ఏమీ కాకుండా పోయారు. ఇక హరిక్రిష్ణ కూడా తెలుగు యువత పదవి చేపట్టి ఆఖరుకు రాజకీయంగా పెద్దగా బావుకున్నది ఏదీ లేదుతెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన జయప్రద కానీ రోజా కానీ పార్టీని విడిచిపెట్టిన తరువాతనే రాణించారు. ఇపుడు ఈ కీలకమైన పదవి విశాఖ జిల్లాకు చెందిన వంగలపూడి అనిత నిర్వహిస్తున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల వేళ ఆమెను ఏకంగా జిల్లా నుంచే దాటించి గోదావరి జిల్లాల్లో సీటు ఇస్తే ఓడిపోయారు. ఆ తరువాత ఆమెను తిరిగి తెచ్చి పాయకరావుపేటకు ఇంచార్జి చేశారు. ఇదిలా ఉంటే వంగలపూడి అనితకు ఇపుడు అక్కడ గట్టి పోటీ ఉంది. నిజానికి పాయకరావుపేట టీడీపీకి కంచుకోట. 1983 నుంచి 2004 వరకూ ఎక్కడా గ్యాప్ లేకుండా గెలుస్తూ వచ్చిన నియోజకవర్గం.ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జిల్లా పరిషత్ మాజీ కార్యనిర్వణాధికారి గొల్ల బాబూరావు బంపర్ మెజారిటీతో గెలిచి తొలిసారి సైకిల్ కి పంక్చర్ వేశారు. జగన్ వైపునకు వచ్చిన తరువాత 2012 ఎన్నికల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఆయన గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం గొల్ల బాబూరావుని అక్కడ నుంచి తప్పించి జగన్ అమలాపురం ఎంపీ అభ్యర్ధిగా పంపారు. దాంతో అక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన వంగలపూడి అనిత గెలిచారు. ఇక 2019లో బాబూరావుకే ఆ సీటు కేటాయించడంతో మళ్లీ జెండా ఎగరేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తనదే విజయం అని గొల్ల బాబూరావు గట్టిగానే చెబుతున్నారుఇదిలా ఉంటే తన సీనియారిటీని, సిన్సియారిటీని గుర్తించి మంత్రి పదవిని గొల్ల బాబూరావు కోరుకుంటున్నారు. ఆయనకు ఆ పదవి దక్కితే మాత్రం తెలుగు మహిళ వంగలపూడి అనిత ఇక్కడ గెలుపు ఆశలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అది కాకపోయినా కూడా జగన్ సంక్షేమ పధకాలు, గొల్ల బాబూరావుకి స్థానికంగా ఉన్న పట్టు కారణంగా వైసీపీని ఓడించడం కష్టమేనని అంటున్నారు. వంగలపూడి అనిత అయితే పాయకరావుపేట మీద దృష్టి పెట్టి బాగానే పోరాడుతున్నారు. క్యాడర్ ని చేరదీసి టీడీపీ బలాన్ని పెంచుతున్నారు. కానీ ఏపీవ్యాప్తంగా చూస్తే ఇపుడు టీడీపీ వీక్ గా ఉంది. 2024 నాటికి వేవ్ వచ్చి సైకిల్ జోరందుకుంటే ఫరవాలేదు కానీ లేకపోతే మాత్రం అనితకు ఇదే చివరి చాన్స్ అవుతుంది అన్న మాట అయితే వినిపిస్తోంది.