శ్రీకాకుళం, ఆగస్టు 25,
భావనపాడు పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చినట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. పోర్టు నిర్మాణానికి 'రైట్స్' సంస్థ రూపొందించిన పోర్టు లేఅవుట్‌కు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కొన్ని మార్పులు సూచించడంతో కేంద్రానికి ఆమోదయోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూసేకరణకు సంబంధించి మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్ వలన్ తాజాగా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్‌కు లేఖ రాశారు. పోర్టు నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ, జిరాయితీ, అసైన్డ్, అటవీ, ఉప్పు భూములను ఎంతమేర సేకరించాలో లేఖలో పేర్కొన్నారు. పోర్టు నిర్మాణానికి 3,970 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భావనపాడు పోర్టు నిర్మాణంపై రైట్స్ సంస్థ రూపొందించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డిపిఆర్)ను ప్రభుత్వం గతేడాది ఆగస్టు 25వ తేదీన ఆమోదించింది. పోర్టు నిర్మాణానికి 2,960 ఎకరాలు అవసరమని పేర్కొంది. ఈ డిపిఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు అందజేసింది. లేఅవుట్‌లో కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. దీంతో, కొత్త లేఅవుట్‌కు అనుగుణంగా మరో 1,010 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందులో 234.44 ఎకరాలు అటవీ భూమి, 2.99 ఎకరాల ఉప్పులు భూములు ఉన్నాయి. వీటిని మినహాయించి 772.57 ఎకరాలను సేకరించాలని జిల్లా అధికారులకు సూచించారు. అటవీ, ఉప్పు భూముల క్లియరెన్స్ కోసం ఎపి మారిటైం బోర్డు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వివరాలు సమర్పించింది. వాటికి ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. భావనపాడు పోర్టు నిర్మాణ, నిర్వహణకు 2018లో టెండర్లు పిలిచారు. టెండర్లను అదానీ పోర్ట్సు దక్కించుకుంది. నిర్మాణానికి ముందుకు రావడంతో 2019 జనవరిలో గ్రామసభ నిర్వహించి అదే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో నాలుగు పర్యాయాలు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల తర్వాత వైసిపి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల తాము నష్టపోతామంటూ, ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామంటూ అదానీ పోర్ట్సు ప్రకటించింది. దీంతో, రాష్ట్ర ప్రభుత్వమే పోర్టు నిర్మించాలని నిర్ణయించి భావనపాడు పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఒక్కో అడుగు వేస్తూ ప్రస్తుతం భూసేకరణ వరకు తీసుకొచ్చింది. గత ఒప్పందంలోని కొన్ని అంశాలను అదానీ పోర్ట్సుకు అనుకూలంగా మారిస్తే, మళ్లీ ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదానీకి మళ్లీ అప్పగిస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని గంగవరం, కృష్ణపట్నం పోర్టులు అదానీ వశమయ్యాయి.