సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం కిష్టారెడ్డి పేట్లో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. కిష్టారెడ్డి పేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏర్పుల కృష్ణ, ఉప సర్పంచ్ ఎండి. ఫహీమ్లు వార్డు మెంబర్లకు వాటాలు పంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమీన్ పూర్ మండలం .. కిష్టారెడ్డి పేట్ గ్రామ పంచాయతీ అవుటర్ రింగ్ రోర్డుకు సమీపంలో ఉండడంతో అక్కడ నూతన గృహ, అపార్ట్మెంట్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్ బిల్డింగ్ అనుమతలు పేరుతో, రోడ్ల నిర్మాణం, విలేజ్ డెవలప్ మెంట్ పేరుతో లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే ఈ డబ్బును సర్పంచ్, ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లకు వాటాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే పంచడం గమనార్హం. ఈ డబ్బుల పంపకానికి సంబంధించిన వ్యవహారమంతా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజ్లో రికార్డైంది. ఈ వీడియో కాస్త బయటకు రావడంతో పాలక మండలి సభ్యులు అడ్డంగా బుక్కయ్యారు. తమ అవినీతి కార్యక్రమానికి గ్రామ పంచాయతీనే అడ్డగా మార్చడంతో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే గతంలోనే వీరిద్దరిపై అవినీతి ఆరోపణలు రావడంతో కలెక్టర్ వీరిని ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆర్డర్ ఇచ్చిన కేవలం 40 రోజుల్లోనే సస్పెక్షన్ క్యాన్సల్ కావడం గమనార్హం. ఇక తాజాగా బయట పడ్డ సీసీ కెమెరాల దశ్యాలు, ఆడియో ఆధారాలను వార్డ్ మెంబర్ దొంతి అశోక్ కలెక్టర్కు సమర్పించారు.