YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నేతలకు వణకు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్స్

నేతలకు వణకు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్స్

హైదరాబాద్, ఆగస్టు 25, 
హుజురాబాద్‌లో రాజకీయ నేతలను ఉప ఎన్నికలతో పాటు ఫోన్‌ ట్యాపింగ్‌ భయపెడుతోంది. ఫోన్‌ కాల్‌ వస్తే చాలు ఉలిక్కిపడుతున్నారట. ఫోన్‌ రింగ్‌ వినిపిస్తే.. గుండెల్లో దడ పెరుగుతోందట. ఎటు నుండి ఏ ముప్పు వస్తుందోనన్న టెన్షన్‌తో నేతలు భయపడిపోతున్నారు.చేతిలో ఫోన్‌ ఉంది కదా అని ఎడా పెడా మాట్లాడేస్తే.. ఆ కాల్‌ రికార్డింగ్‌లు బయటకొచ్చి ఇటీవల పలువురు నేతలను చిక్కుల్లో పడేసిన సందర్భాలు ఉన్నాయి. క్షణాల్లో వైరలవడంతో వారి పదవులకే ఎసరు పెడుతున్నాయి. దీంతో ఫోన్‌ మాట్లాడలంటేనే భయపడతున్నారు. త్వరలో ఉపఎన్నికలు జరగనున్న హుజురాబాద్‌లో ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ ఫోబియా నిద్ర లేకుండా చేస్తోందట. అత్యవసరమైతే తప్ప ఫోన్‌లో మాట్లాడాలంటే జంకుతున్నట్ల సమాచారం. టిఆర్‌ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌ నేతలే కాదు.. ఇతర పార్టీ శ్రేణులను సైతం ఫోన్‌లు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని తెలుస్తోంది. ఇదే అంశం ప్రస్తుతం హజురాబాద్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.ఫోన్‌ ట్యాపింగ్‌ ప్రచారం పెద్దఎత్తున సాగుతుండడంతో హుజురాబాద్‌లోని ఐదు మండలాల నేతలు సైతం రెగ్యులర్‌ ఫోన్లు కూడా మాట్లాడటం లేదట. ఎవరైనా ఫోన్‌ చేస్తే తర్వాత కలుద్దాం అంటూ పొడిపొడిగా సమాధానమిస్తున్నారు. లేకుంటే వాట్సాప్‌ కాల్‌ చేయమని సూచిస్తున్నారట. అధికార టిఆర్‌ఎస్‌ నేతలైతే.. సెల్‌ఫోన్‌ చేతిలో ఉన్న శత్రువుగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారట. ఈ విషయంలో ఇప్పటికే ఒకరిద్దరు నేతలు పార్టీ ముఖ్యనేతలతో చీవాట్లు తిన్నారట. అప్పటి నుంచీ అంతా వాట్సాప్‌ కాల్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారట.హుజురాబాద్‌ టిఆర్‌ఎస్‌లో కొందరు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నట్లు ముఖ్య నేతలు అనుమానిస్తున్నారట. దీంతో వారెవరో తెలుసుకునేందుకే అధికార పార్టీ నేతల నిఘా విభాగాలు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. స్మార్ట్‌ఫోన్లు కొంతమంది నాయకుల ఇంటర్నల్‌ విషయాలను బట్టబయలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని కంపెనీల మొబైల్స్‌లో ఆటోమెటిక్‌ కాల్‌రికార్డింగ్‌ ఆప్షన్‌ ఉండటంతో.. అది తెలియక ఇబ్బంది పడుతున్న నాయకులు చాలామందే ఉన్నారట. పాడి కౌశిక్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ వేటు వేయడానికి ముందు ఆయన ఒక యువకునితో మాట్లాడిన ఆడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా ఎవరి ఫొన్లో ఎవరిగుట్టు దాగుందో అంతుచిక్కని పరిస్థితి ఉందట. హుజూరాబాద్‌ నాయకులకు ప్రస్తుతం ఇదే భయం పట్టుకుంది.మొత్తానికి చేతిలో కాస్ట్‌లీ ఫోన్‌ ఉంటే.. నలుగురిలో తమ ప్రతిష్ట పెరుగుతుందనుకునే నేతలు.. ఇప్పుడు అదే సెల్‌ఫోన్‌ను చూసి ఆటంబాంబులా ఫీలవుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్‌కు ఆటంబాంబులా మారిందని ఆందోళన పడుతున్నారు. ఒకప్పుడు గంటలు గంటలు మాట్లాడినవారు సైతం.. సరే.. చూద్దాుం చేద్దాం అంటూ పొడిపొడి మాటలతో సరిపెట్టేస్తున్నారు. మొత్తానికి ఒక ఉపఎన్నిక.. ఫోన్‌ ట్యాపింగ్‌ అన్ని పార్టీల నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

Related Posts