YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

దూకుడు పెంచిన కృష్ణాబోర్డు

దూకుడు పెంచిన కృష్ణాబోర్డు

హైదరాబాద్, ఆగస్టు 25, 
బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో కృష్ణా బోర్డు దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే త్రీమెన్, ఫుల్బోర్డు మీటింగ్‎లను ఏర్పాటు చేసింది. ఈ రెండు మీటింగ్‎లకూ తెలంగాణ గైర్హాజరైంది. మరోవైపు కృష్ణా జలాల తరలింపులో తెలంగాణ ప్రధానంగా వ్యతిరేకిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సైతం ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలించింది. ఇదే నేపథ్యంలో ఈ నెల 27న కేఆర్ఎంబీ ఫుల్బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, డిమాండ్లు, నిర్వహణ నిధులు, ఇలా 12 కీలక అంశాలతో రూపొందించిన ఎజెండా పత్రాన్ని కూడా రాష్ట్రానికి పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశానికి బుధవారం డేట్‌ఫిక్స్ చేశారు. ఎజెండా అంశాలతో పాటుగా కేఆర్‎ఎంబీకి సిబ్బందిని అప్పగించే అంశాలపై సీఎం సమీక్షించనున్నారు.కేంద్ర గెజిట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం బోర్డుల సమావేశానికి హాజరుకాలేదు. ఆ తర్వాత న్యాయ నిపుణులు, ఇరిగేషన్ ఇంజినీర్లతో చర్చించిన సీఎం.. పూర్తిస్థాయి సమీక్ష చేయలేదు. మరోవైపు గెజిట్అమలుకు కేంద్రం అక్టోబర్ 14 వరకు గడువు ఇచ్చింది. ఈలోగా అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలని సూచించింది. కేంద్ర గెజిట్‎లో కృష్ణా, గోదావరి నదులపై దాదాపుగా 24 ప్రాజెక్టులకు అనుమతులు లేవని వెల్లడించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లైంది. ఇప్పటికిప్పుడు ఆ ప్రాజెక్టులు అనుమతులు రావాలంటే కష్టమే. అంతేకాకుండా వాటి అనుమతుల కోసం ఇప్పటి వరకు దరఖాస్తులు కూడా చేయలేదు. దీంతో ఈ నెలన్నర రోజుల్లో ప్రాజెక్టులపై ముందుకు వెళ్లడంపై ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతోంది. గెజిట్‎పై న్యాయపరంగా స్టే తెచ్చుకోవడం కూడా సాధ్యం కాదనే పరిస్థితి ఉన్నట్లు ఆయా వర్గాలు సూచించాయి. ఈ పరిణామాల్లో కృష్ణా జల వివాదాలపై ఎలా ముందడగు వేయాలనే సీఎం భావిస్తున్నారు. సెప్టెంబర్ 1న జరిగే కేఆర్‎ఎంబీ ఫుల్బోర్డు మీటింగ్‎కు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఇరిగేషన్పై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహిస్తున్నారు. బోర్డు సమావేశానికి రెండు రోజుల ముందే సమీక్షిస్తున్నారు. బోర్డు ఎజెండాలో సూచించినట్లుగా 50 శాతం నిష్పత్తిలో పంపిణీ చేయాలని కోరనున్నారు. కృష్ణా నదీ పరీవాహకంలో రెండు రాష్ట్రాలకు నీటి వాటాల పంపకం ఇప్పటివరకు 66:34 నిష్పత్తితో కొనసాగుతోంది. 2021-22 ఏడాది నుంచి 50 శాతం నిష్పత్తితో పంపిణీ చేయాలని తెలంగాణ పట్టుపడుతోంది. అదే విధంగా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ జారీ చేసిన కృష్ణా బోర్డు పరిధి నిర్ణయం, గెజిట్ నోటిఫికేషన్ అమలుపై కూడా సీఎం చర్చించనున్నారు. గెజిట్‎ను అనుసరించి కొత్త ప్రాజెక్టులకు ఎలా అనుమతులు పొందాలి, అనుమతి లేని వాటిపై ఎలా ముందుకెళ్లాలనే అంశాలను ఇరిగేషన్ నిపుణులతో చర్చించనున్నారు.గడిచిన రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్రం కృష్ణా ప్రాజెక్టుల నుంచి అనుమతి లేకుండా జల విద్యుత్ ఉత్పత్తి చేసిందని ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు, ప్రాజెక్టుల పరిధిలో వందశాతం జల విద్యుదుత్పత్తి చేయాలంటూ జెన్కోకు తెలంగాణ ఆదేశాలు జారీ చేయడంపై అభ్యంతరాలు, శ్రీశైలంలో 854 అడుగుల దిగువకు నీటిమట్టం పడిపోతే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు సాధ్యం కాదని, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అభ్యంతరాలు, తెలంగాణ రాష్ట్రం చిన్ననీటి పారుదల కింద చెక్ డ్యాంలు, చెరువుల నిర్మాణం, విస్తరణ చేపట్టిందంటూ ఏపీ చేసిన ఫిర్యాదు, ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లీస్తున్న నేపథ్యంలో నిబంధనల మేరకు 45 టీఎంసీలను కృష్ణా జలాల్లో వాటాగా ఇవ్వాలనే తెలంగాణ విజ్ఞప్తితో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. వీటన్నింటిని కూడా కృష్ణా బోర్డు ఎజెండాలో పొందుపర్చింది.అక్టోబరు 14 నుంచి కృష్ణా జలాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోవాలనుకుంటున్న కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు 446మంది సిబ్బందిని అప్పగించింది. దీంతో వీరిని తమ పరిధిలోకి తీసుకుంటున్నామంటూ కేఆర్‌ఎంబీ ప్రకటించింది. వీరంతా అక్టోబరు 14 నుంచి కేఆర్‌ఎంబీ రోజువారీ ఇచ్చే ఆదేశాల మేరకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని, వీరికి జీతభత్యాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని, నియంత్రణ కేఆర్‌ఎంబీ వద్ద ఉంటుందని వెల్లడించారు.సమావేశంలో బోర్డు పరిధిపై, యాజమాన్య నిర్వహణ అంశాలపై చర్చిస్తామని, ఈలోగా శాశ్వత ప్రాతిపదికన నియమితులైన ఉద్యోగుల వివరాలను తమకు అందించాలని బోర్డు సూచించింది. ఒక సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజనీర్‌, ఐదుగురు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, 17 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, 62 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు లేదా అసిస్టెంట్‌ ఇంజనీర్లు, 33 మంది సర్కిల్‌ స్కేల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ టెక్నీషియన్లు, 156 మంది సర్కిల్‌ స్కేల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ టెక్నీషియన్లు, 24 మంది ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు, 148 మంది వర్క్‌చార్జ్‌డ్‌ ఉద్యోగులను కేఆర్ఎంబీకి కేటాయించారు.

Related Posts