కరీంనగర్, ఆగస్టు 25,
హుజూరాబాద్ ఉపఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్…అధికార టీఆర్ఎస్ వ్యూహాలని తట్టుకుని, మరొకసారి తన సొంత నియోజకవర్గంలో సత్తా చాటాలని చూస్తున్నారు. ఓ వైపు అధికార టీఆర్ఎస్ మొత్తం హుజూరాబాద్‌పై ఫోకస్ చేసి రాజకీయం చేస్తుంది. అటు కేసీఆర్, ఇటు హరీష్ రావులు హుజూరాబాద్ టార్గెట్‌గానే కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. ఎలాగైనా ఈటలని ఓడించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందుకే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు.అసలు అన్నీ వైపులా నుంచి ఈటలకు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. కానీ ఇటు వైపు ఈటల ఒక్కరే…టీఆర్ఎస్‌ని ధీటుగా ఎదురుకుంటూ ముందుకెళుతున్నారు. హుజూరాబాద్‌లో బీజేపీకి పెద్ద బలం లేకపోయినా, తన సొంత బలం, హుజూరాబాద్ ప్రజల మీద నమ్మకంతో ఈటల ఎన్నికల బరిలో దిగారు. ఇక అధికార పార్టీ రాజకీయంగా ఎన్ని ఎత్తుగడలు వేసి తనని దెబ్బకొట్టాలని చూసినా సరే, వాటికి ధీటుగా ఈటల నిలబడుతున్నారు. ఈటలని ఓడించడానికి ఎన్ని కార్యక్రమాలు చేసినా, అవన్నీ ఈటల రాజీనామా చేయడం వలనే హుజూరాబాద్‌కు ప్రజలకు వరాలు మాదిరిగా మారాయని చెప్పొచ్చు.అందుకే అక్కడ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని వరాలు కురిపించిన, అదంతా ఈటల వల్లే అని నమ్ముతున్నారు. అయితే ఇక్కడ వరకు ఈటలకు పెద్ద ఇబ్బంది ఏమి లేదనే చెప్పొచ్చు. కానీ కేంద్రంలో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతుంది. పలు అంశాల్లో బీజేపీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.ఇప్పుడు ఆ వ్యతిరేకత హుజూరాబాద్‌లో వస్తే, ఈటలకు ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఇప్పటికిప్పుడు కేంద్రంలో ఉండే రాజకీయాలు హుజూరాబాద్ ప్రజలు పెద్దగా పట్టించుకోవడమే లేదనే చెప్పొచ్చు. కాకపోతే కేంద్ర నాయకులు, రాష్ట్రంలో బడా నాయకులు హుజూరాబాద్ ప్రచారంలో దిగితే ప్లస్ అవ్వడం పక్కనబెడితే, ఈటలకు కాస్త మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అందుకే ఆ నెగిటివ్ రాకుండా చూసుకోవాలని ఈటల చూస్తున్నారు. బీజేపీ నేతలని ప్రచారంలో ఎక్కువ లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. లోకల్ నాయకులతోనే ముందుకెళ్లాలని ఈటల చూస్తున్నారు. మరి ఈటల ప్లాన్ ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలి.